Congress: మణిపుర్‌లో కాంగ్రెస్‌ విజయం.. ఆయనకు చెంపపెట్టు: జైరాం రమేశ్‌

లోక్‌సభ ఎన్నికల్లో మణిపుర్‌లోని రెండు స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకోవడంపై హర్షం వ్యక్తంచేసిన ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌.. మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. 

Published : 05 Jun 2024 14:31 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా వెలువడ్డాయి. ఇండియా కూటమి 233 స్థానాలను కైవసం చేసుకొంది. అయితే.. జాతుల మధ్య వైరంగా కొనసాగుతున్న మణిపుర్‌ (Manipur)లోని రెండు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ (Congress) అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. కల్లోలిత ప్రాంతంలో హస్తం పార్టీ విజయం సాధించడంపై సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh) హర్షం వ్యక్తం చేశారు.

‘‘గతేడాది మే 3 నుంచి జాతుల వైరంతో మణిపుర్‌ అల్లకల్లోలమవుతోంది. నాటినుంచి నేటివరకు అక్కడి ప్రజలు నిత్యం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. మణిపుర్‌లోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ను ఎన్నుకుని ఎంతో శక్తివంతమైన సంకేతాలను పంపారు. మణిపుర్‌ ప్రజలు హస్తం పార్టీకి పెద్ద బాధ్యతను అప్పగించారు’’ అని జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా పేర్కొన్నారు.

‘నా ఎత్తెంతో నాకు తెలుసు’.. స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘‘క్లిష్ట సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మణిపుర్‌ను ప్రధాని మోదీ ఇంతవరకు సందర్శించలేదు. ఆయన ప్రజలను పట్టించుకోలేదు. గతంలో రాహుల్‌ గాంధీ మణిపుర్‌ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రజలను సంప్రదించకుండా చేసింది. అనుమతించని ప్రాంతంలో కాంగ్రెస్‌ గెలుపు మోదీకి చెంపపెట్టు’’ అని కాంగ్రెస్‌ నేత తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఔటర్‌ మణిపుర్‌లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన ఆల్‌ఫ్రెడ్ కన్ంగమ్ ఎస్.ఆర్థర్ తన సమీప ప్రత్యర్థి, ఎన్‌పీఎఫ్‌కి చెందిన కచుయ్‌ తిమోతీ జిమిక్‌ను 85,418 ఓట్ల తేడాతో ఓడించారు. ఇన్నర్‌ మణిపుర్‌లో అంగోమ్‌చా బిమోల్‌ అకోయిజం భాజపాకు చెందిన తౌనోజం బసంతకుమార్‌పై 1,09,801 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని