Karnataka CM: సీఎం రేసులో వెనక్కి తగ్గని డీకే.. సుర్జేవాలా కీలక వ్యాఖ్యలు

కర్ణాటక (Karnataka) సీఎం రేసు నుంచి వెనక్కి తగ్గేందుకు డీకే శివకుమార్‌ (DK Shivakumar) ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో పార్టీ హైకమాండ్‌ ఇచ్చిన ఆఫర్‌ను ఆయన తిరస్కరించినట్లు సమాచారం.

Updated : 17 May 2023 17:06 IST

దిల్లీ: కర్ణాటక (Karnataka) నూతన ముఖ్యమంత్రి (Chief Minister) ఎంపికపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. తదుపరి సీఎంగా సీనియర్‌ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) పేరు దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్న సయమంలో కాంగ్రెస్ (Congress) అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా (Randeep Surjewala) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎంపికపై అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో కొత్త సీఎం పేరును పార్టీ ప్రకటిస్తుందని తెలిపారు. 48-72 గంటల్లో కర్ణాటకలో కొత్త కేబినెట్‌ కొలువుదీరుతుందని చెప్పారు.

హైకమాండ్‌ ప్రతిపాదనకు డీకే నో..

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య (Siddaramaiah)నే ఎంచుకోవాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయించినట్లు ఈ ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ రేసులో సిద్ధూతో తీవ్రంగా పోటీ పడుతున్న పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shivakumar)కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేలా పార్టీ ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లేదా.. సీఎం పదవీకాలాన్ని ఇద్దరికీ పంచేలా నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యాహ్నం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)తో డీకే సమావేశమయ్యారు. అయితే, హైకమాండ్‌ ప్రతిపాదనలకు శివకుమార్‌ అంగీకరించలేదని సమాచారం. రేసులో తాను వెనక్కి తగ్గబోనని డీకే.. రాహుల్‌కు స్పష్టంగా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాహుల్‌తో భేటీ అనంతరం శివకుమార్‌ (DK Dhivakumar) నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి.

సిద్ధూ ఇంటి వద్ద సంబరాలు..

సీఎంగా సిద్ధు ఎంపిక దాదాపు ఖరారైనట్లు వార్తలు రావడంతో ఆయన మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు. బెంగళూరులోని సిద్ధూ నివాసం వద్ద కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆయన పోస్టర్‌కు పాలాభిషేకం చేశారు. అటు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి కంఠీరవ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖర్గేను సీఎం చేయాలంటూ ఆందోళన..

మరోవైపు ఈ పరిణామాల మధ్య.. మరో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను కర్ణాటక సీఎం చేయాలని రాష్ట్ర ఎస్సీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీలు అత్యధికంగా ఉన్నందున ఖర్గేను ముఖ్యమంత్రిని చేయాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు కర్ణాటక పీసీసీ కార్యాలయం ఎదుట వారు ఆందోళనకు దిగారు. అలా చేస్తే సిద్ధరామయ్య, డీకేలు నోరు మెదిపే అవకాశాలు ఉండవనే విశ్లేషణలు కూడా వినిపిస్తుండటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని