KCR: లోక్‌సభ ఎన్నికల్లో భారాస, భాజపా మధ్యే పోటీ: కేసీఆర్‌

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో భాగంగా తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌ నియోజకవర్గ నేతలతో భారాస అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు.

Updated : 03 Mar 2024 18:30 IST

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో త్వరలో బస్సు యాత్రలు చేద్దామని పార్టీ నేతలకు భారాస అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో భారాస, భాజపా మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేతలు హరీశ్‌ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్, సంతోశ్‌ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మండల స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని సూచించారు.

సోమవారం భారాస అభ్యర్థుల జాబితా!

‘‘కరీంనగర్‌ పార్లమెంటు స్థానంలో భారాస గెలవబోతోంది. ఈ నెల 12న కరీంనగర్‌లోని ఎస్‌.ఆర్‌.ఆర్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలి. అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి తెచ్చారు. భారాసతో మేలు జరుగుతుందనే చర్చ ప్రజల్లో మొదలైంది. శాసనసభ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దు. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలి’’ అని కేసీఆర్‌ సూచించారు. మరోవైపు, కరీంనగర్‌ అభ్యర్థి ఎంపికపై సమావేశంలో చర్చ జరిగింది. మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. సోమవారం భారాస లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు నీళ్లు, విద్యుత్‌ ఇవ్వట్లేదని కేసీఆర్‌ ఆరోపించారు. ‘‘ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో గతంలో భారాసను కాంగ్రెస్‌ విమర్శించింది. అధికారంలోకి వస్తే ఉచితంగా చేస్తామని మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలి. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం. మధ్యమానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశాం. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పూనుకొని పరిష్కరించాలి. ఒక్క పన్ను పాడైతే చికిత్స చేసుకుంటాం తప్ప మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా!’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని