KCR: వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్‌

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆజన్మ తెలంగాణవాది.. ఈ సమయంలో ఆయన్ను స్మరించుకోకుండా ఉండలేమని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు.

Updated : 02 Jun 2024 14:13 IST

హైదరాబాద్: ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆజన్మ తెలంగాణ వాది అని..  ఈ సమయంలో ఆయన్ను స్మరించుకోకుండా ఉండలేమని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. అప్పట్లో చాలా మంది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. గతంలో తెలంగాణ అనే పదాన్నే పలకవద్దని అప్పటి స్పీకర్‌ అసెంబ్లీలో అన్నారని చెప్పారు. ఇక్కడి భాష స్వచ్ఛమైన తెలుగు కాదని కొందరు హేళన చేశారన్నారు. 

‘‘ముల్కీ నిబంధనల అంశం చాలా ఏళ్లు న్యాయపోరాటంగా మారింది. ఆ నిబంధనలు సమంజసమే అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తీర్పుతో ఆంధ్రాలో జై ఆంధ్రా ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో 70 మందికిపైగా కాల్పుల్లో చనిపోయారు. సుప్రీం తీర్పును కాలరాస్తూ కేంద్రం రాజ్యాంగ సవరణ చేసింది. ఎప్పటికైనా ఓ నాయకుడు రాకపోతాడా అని జయశంకర్‌ భావించారు. ఉమ్మడి ఏపీలో ముగ్గురు తెలంగాణ వాళ్లే సీఎంలు అయ్యారు. తెలంగాణ వ్యక్తి సీఎం కాగానే ఏదో ఒక గొడవ పెట్టి దించేసేవారు. వ్యూహం లేకపోవడం వల్లే 1969 ఉద్యమం విఫలమైంది. 2001లో కాదు.. 1999లోనే ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమ రూపాలు గుర్తు చేసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఉద్యమం ప్రారంభించగానే పదవులు, డబ్బు కోసం మొదలుపెట్టారనే ప్రచారం చేసేవారు. ఆ సమయంలో ఎవరైనా డబ్బు అడిగితే నాకు ఫోన్‌ చేయాలని చెప్పా. ఉద్యమ కార్యాచరణ కోసం ఆఫీసుకు స్థలం ఇచ్చారని కొండా లక్ష్మణ్‌ బాపూజీ నివాసం కూలగొట్టారు. కార్యాలయం కోసం తెలంగాణలోనే తెలంగాణ వ్యక్తికి స్థలం దొరకని పరిస్థితి కల్పించారు. 

భారాస మహావృక్షం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కొంత నైరాశ్యంలో ఉన్నాం. కానీ ఆ తర్వాత బస్సు యాత్ర మొదలుపెట్టగానే మళ్లీ అదే గర్జన కనిపించింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది భారాసనే. చేప పిల్లలు, గొర్రె పిల్లలను పంపిణీ చేస్తే అపహాస్యం చేశారు. భారాస హయాంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేశాం. కేవలం 1.08 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. రాజకీయం నిరంతర ప్రవాహం.. అధికారంలో ఉంటేనే రాజకీయం కాదు. ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాం’’ అని కేసీఆర్‌ అన్నారు. 

ఎగ్జిట్‌ పోల్స్‌ ఓ గ్యాంబ్లింగ్‌

ఎగ్జిట్‌ పోల్స్‌ ఓ గ్యాంబ్లింగ్‌లా తయారయ్యాయని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఒక్కో సంస్థ ఒక్కోలా లెక్కలు చెబుతున్నాయన్నారు. ‘‘రాజకీయ ఫలితాలు వస్తుంటాయి.. పోతుంటాయి. గెలుపోటములు ఎలా ఉన్నా.. ప్రజాక్షేత్రంలో పనిచేస్తూనే ఉండాలి. ఎగ్జిట్‌ పోల్స్‌లో భారాసకు 11 స్థానాలు వస్తాయని ఒకరు.. ఒక సీటు వస్తుందని మరొకరు చెప్పారు. 11 సీట్లు వచ్చినంత మాత్రాన పొంగిపోయేది లేదు.. 3 వచ్చినా కుంగిపోయేది లేదు. రాజకీయ జయాపజయాలు మనకి లెక్కకాదు’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని