KTR: ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోళ్లలో రూ.1,100 కోట్ల కుంభకోణం

ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.1,100 కోట్ల భారీ కుంభకోణానికి తెరతీసిందని.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమక్షంలోనే అనధికారిక ఒప్పందాలు కుదుర్చుకున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు.

Published : 27 May 2024 03:32 IST

మంత్రి ఉత్తమ్‌ సమక్షంలో అనధికారిక ఒప్పందాలు
నాలుగు సంస్థలకే టెండర్లు దక్కేలా గోల్‌మాల్‌
సీఎం కార్యాలయంతో పాటు దిల్లీ పెద్దల వరకూ పాత్ర
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపణలు

ఈనాడు- హైదరాబాద్‌ : ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.1,100 కోట్ల భారీ కుంభకోణానికి తెరతీసిందని.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమక్షంలోనే అనధికారిక ఒప్పందాలు కుదుర్చుకున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. సన్నబియ్యం టెండర్లు నాలుగు సంస్థలకే దక్కేలా నిబంధనల రూపకల్పనలోనే గోల్‌మాల్‌ చేశారన్నారు. ఒక సంస్థ కిలోకు రూ.57 కోట్‌ చేయగా.. మిగిలిన మూడు సంస్థలు రూ.56.90 కోట్‌ చేశాయని, దీన్నిబట్టే కుమ్మక్కయ్యారని అర్థమవుతోందన్నారు. ఒకవేళ ఇది యాదృచ్ఛికంగా జరిగి ఉంటే.. ఇంతకంటే అద్భుతం ఇంకొకటి ఉండదని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని, హైదరాబాద్‌  నుంచి దిల్లీ పెద్దల దాకా అనేకమంది హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో ఆదివారం భారాస నేతలు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, రవీందర్‌  సింగ్‌  తదితరులతో కలిసి కేటీఆర్‌  విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ధాన్యం అమ్మకాల్లో రూ.700-750 కోట్లు

‘‘35 లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి గ్లోబల్‌ టెండర్ల పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి దందాకు తెరలేపింది. ఈ ఏడాది జనవరి 25న కమిటీ ఏర్పాటు చేసి, ఆ రోజునే మార్గదర్శకాలు విడుదల చేసి.. అదే రోజు టెండర్లు పిలిచింది. అవినీతి సొమ్ము కోసమే కాంగ్రెస్‌ పెద్దలు వేగంగా స్పందించారు. ధాన్యాన్ని క్వింటాలుకు రూ.2,100 చొప్పున కొంటామని స్థానిక రైస్‌మిల్లర్లు ముందుకొచ్చినా.. కేవలం నాలుగు సంస్థలు గ్లోబల్‌ టెండర్లను దక్కించుకునేలా నిబంధనలు రూపొందించారు. పనితీరు బాగోలేదనే కారణంతో భారాస ప్రభుత్వం బ్లాక్‌ లిస్టులో పెట్టిన ఒక సంస్థకు కూడా కాంగ్రెస్‌ సర్కారు టెండర్‌  అప్పగించింది. క్వింటాలుకు రూ.1,885 నుంచి రూ.2,007కు కోట్‌ చేసి టెండర్లు దక్కించుకున్నాయి. రూ.93 నుంచి రూ.200 తక్కువకు టెండర్లను ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ నాలుగు సంస్థలు తాము కోట్‌ చేసిన మొత్తానికి ధాన్యం సేకరించాలి. కానీ, క్వింటాలుకు రూ.2,230 చొప్పున తమకు చెల్లించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 వేల మంది రైస్‌ మిల్లర్లను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాయి. 35 లక్షల టన్నులకు క్వింటాలుకు కనీసం రూ.200 చొప్పున అదనంగా రూ.700-750 కోట్లు వసూలు చేస్తున్నాయి. ఆ సొమ్ముతో మనీ లాండరింగ్‌ కు పాల్పడుతున్నాయి. 

సన్నబియ్యం కొనుగోలులో రూ.300-350 కోట్లు

2.20 లక్షల టన్నుల సన్నబియ్యం కొనుగోలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.300-350 కోట్ల అవినీతికి తెరలేపింది. రాష్ట్రంలో కిలో బియ్యం రూ.42కు అందుబాటులో ఉండగా.. రూ.57కు కొంటోంది. సన్నబియ్యం కొనుగోళ్లనూ గ్లోబల్‌ టెండర్‌  ద్వారా ఆ నాలుగు సంస్థలకే కట్టబెట్టింది. కిలోకు రూ.15 చొప్పున అదనంగా చెల్లిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో భాజపా పాత్ర అనుమానాస్పదంగా ఉంది. ధాన్యం సేకరణ, కనీస మద్దతు ధర అమలు, బియ్యం సేకరణ ఎఫ్‌సీఐ అధీనంలోనే జరుగుతాయి. రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని భాజపా శాసనసభాపక్ష నేత చెబుతున్నా.. కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల పాత్ర ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. మేము నిర్దిష్టంగా చేస్తున్న అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి స్పందించాలి. రెండు టెండర్లపైనా సిటింగ్‌  జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి. శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈడీ, సీబీఐలకు ఎఫ్‌సీఐ ఫిర్యాదు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ స్పందించకుంటే న్యాయస్థానంలో కేసులు వేస్తాం. సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తాం’’ అని కేటీఆర్‌  పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని