KTR: కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నీటి నిర్వహణ చేసే తెలివి లేదు: కేటీఆర్‌

మిషన్‌ భగీరథ నిర్వహణ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలియదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 03 Apr 2024 11:58 IST

హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ నిర్వహణ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలియదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవని చెప్పారు. నేడు ఇక్కడ ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తోందన్నారు. మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లు వినియోగంలోకి వచ్చాయని ఎద్దేవా చేశారు. మారుమూల తండాల్లోనూ తాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. వేసవి ఆరంభంలోనే ఎద్దడి మొదలైందని.. మరో రెండు నెలలు ఎండలు ఉంటాయని చెప్పారు. ఇదంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత అన్నారు. 

‘‘గతేడాది వర్షాలు బాగా కురిశాయని ఐఎండీ చెప్పింది. పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. ప్రాజెక్టు గేట్లు ఎత్తండి. ఫోన్‌ ట్యాపింగ్‌పై కాదు.. వాటర్‌ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టాలి. సాగర్‌, సింగూరు, ఎల్లంపల్లి, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లో నీళ్లు ఉన్నాయి. చుట్టూ నీళ్లు ఉండగా హైదరాబాద్‌ వాసులు ఎందుకు కొంటున్నారు? మీకు ఓటు వేయలేదని నగర ప్రజలపై కక్ష కట్టారా? సాగర్ నుంచి 14 టీఎంసీలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ చేసే తెలివి లేదు. సాగునీరు ఇవ్వకుండా పంటలు ఎండిపోయేలా చేశారు. కాళేశ్వరం నుంచి జల పరవళ్లు వస్తున్నాయి. పంటలు ఎండిపోవాలనేదే కాంగ్రెస్‌ ఉద్దేశం. పంటలు పండితే బోనస్‌ ఇవ్వాల్సి వస్తుందనే ఇలాంటి కుట్రలు’’ అని కేటీఆర్‌ ఆరోపించారు. 

పెట్రోల్‌ ధరల పెరుగుదలకు ఎవరిది బాధ్యత?

ప్రతి భారతీయుడు పెరిగిన ముడి చమురు ధరల గురించి ఆలోచించాలని కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. ముడి చమురు ధరలు 2014 నుంచి తగ్గాయని..  కానీ మన దేశంలో ఇదే దశాబ్దంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.35, రూ.40 పెరిగాయని మండిపడ్డారు. దీనికి ఎవరిని నిందించాలి? నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ఎవరు బాధ్యత వహించాలి? అని ఆయన ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని