LS Polls: క్రికెట్‌లో ధోనీ.. రాజకీయాల్లో రాహుల్‌ గాంధీ బెస్ట్‌ ‘ఫినిషర్‌’: కేంద్ర మంత్రి

క్రికెట్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ మాదిరి.. దేశ రాజకీయాల్లో రాహుల్‌ గాంధీ బెస్ట్‌ ‘ఫినిషర్‌’ అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Published : 07 Apr 2024 00:04 IST

భోపాల్‌: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) శనివారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. క్రికెట్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ మాదిరి.. భారత రాజకీయాల్లో రాహుల్‌ (Rahul Gandhi) బెస్ట్‌ ‘ఫినిషర్‌’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీని అంతం చేసేవరకు విశ్రమించబోనని ఆయన ప్రతిన బూనినట్లు ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈమేరకు వ్యాఖ్యానించారు. హస్తం పార్టీకి, అవినీతికి విడదీయరాని అనుబంధం ఉందని విమర్శించారు. అనేక కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాయని.. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ సర్కారులోని మంత్రులపై ఒక్క ఆరోపణ కూడా రాలేదన్నారు.

‘ఉగ్రవాదులు పాక్‌ పారిపోయినా’..: రక్షణమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్‌

ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్‌.. నేడు రెండుమూడు చిన్న రాష్ట్రాలకే పరిమితమైందని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ వల్లే పలువురు నేతలు ఆ పార్టీని వీడినట్లు చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ అనేక హామీలు ఇచ్చిందని, వాటిలో కొన్నైనా నెరవేర్చి ఉంటే.. భారత్‌ చాలా ఏళ్ల క్రితమే శక్తిమంతమైన దేశంగా ఎదిగి ఉండేదన్నారు. అయోధ్య రామమందిరం, ఆర్టికల్‌ 370 రద్దు వంటి వాగ్దానాలను భాజపా ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ విధానాన్ని సమర్థిస్తూ.. దీనిద్వారా సమయాన్ని, వనరులను ఆదా చేయొచ్చని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఇది బలోపేతం చేస్తుందని చెప్పారు. 2045 కల్లా భారత్‌ సూపర్‌పవర్‌గా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

పొరుగు దేశంతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం

యూపీఏ హయాంలో చోటుచేసుకున్న ఉగ్ర ఘటనలను ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్‌తో భారత్ సత్సంబంధాలు కోరుకుంటోందని రాజ్‌నాథ్‌ తెలిపారు. ‘‘పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నాం. ‘స్నేహితులను మార్చవచ్చు.. కానీ, పొరుగువారిని మార్చలేం కదా’ అని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ చెప్పేవారు. ఆయన సూచనను మేం పాటిస్తున్నాం. అయితే.. ఎవరైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు యత్నిస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్తాం’’ అని తెలిపారు. భారత్‌ బలహీనమైన దేశం కాదని.. ఎవరైనా రెచ్చగొట్టిన పక్షంలో అవసరమైతే సరిహద్దు దాటి కూడా చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు. పదేళ్ల పాలనలో ఇప్పటికే ఇది చేసి చూపించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు