Mallikarjun Kharge: మన భూభాగాలను ఆక్రమించారు.. మీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ?.. ఖర్గే విమర్శలు

భారత్‌ భూభాగాలను ఆక్రమించిన చైనా నిర్మాణాలు చేపట్టినా.. ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. 

Updated : 25 May 2024 17:56 IST

శిమ్లా: భారత్‌లోని భూభాగాలను చైనా (China) ఆక్రమించడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర విమర్శలు చేశారు. ఆ దేశం మన ప్రాంతాలను ఆక్రమించినా.. ప్రధాని ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హిమాచల్‌ ప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఖర్గే.. మోదీపై విమర్శలు గుప్పించారు.

‘‘నాటి భారత ప్రభుత్వం (కాంగ్రెస్‌ హయాంలో) పాకిస్థాన్‌తో పోరాడి బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది. భారత్‌ భూభాగాలను చైనా ఆక్రమించింది. ఇక్కడ రోడ్లు, ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. అయినా.. ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ ఉంది?’’ అని ఖర్గే ప్రశ్నించారు.

ఎన్నికల్లో ఓటమిపై.. ఖర్గేను బలిపశువు చేస్తారు: ప్రధాని మోదీ

2023లో హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వరదలు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. మోదీ సర్కార్‌పై ఖర్గే విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ‘‘వరదలతో హిమాచల్‌ అతలాకుతలమైంది. నాడు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల సాయం కోరినా కేంద్రం స్పందించకపోవడం బాధాకరం. రాజ్యాంగం, దేశ ప్రజలను కాపాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో ఉన్న 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తాం’’ అని హామీ ఇచ్చారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని