LS Polls: భాజపాలోకి నవీన్‌ జిందాల్‌.. సొంత గూటికి గాలి జనార్దన్‌రెడ్డి!

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి.. తాను తిరిగి భాజపా గూటికి చేరనున్నట్లు ప్రకటించారు.

Published : 24 Mar 2024 22:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) ముంగిట కాంగ్రెస్‌ (Congress) పార్టీకి మరో షాక్‌ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ నవీన్‌ జిందాల్‌ (Naveen Jindal) ఆదివారం భాజపా (BJP)లో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. అంతకుముందు కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ‘‘పదేళ్లు (2004-14) కురుక్షేత్ర లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించాను. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్‌ నాయకత్వానికి, అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ధన్యవాదాలు. ఈ రోజు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.

గాలి జనార్దన్‌రెడ్డి మళ్లీ కమలదళంలోకి

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి (Gali Janardhana Reddy).. తాను తిరిగి భాజపా (BJP) గూటికి చేరనున్నట్లు ప్రకటించారు. 2022లో కమలదళం నుంచి దూరం జరిగిన ఆయన.. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (KRPP)’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే, నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిగా చూడాలనే లక్ష్యంతో తన మద్దతుదారులతో చర్చించి.. తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సోమవారం భాజపాలో చేరతానని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి నుంచి భాజపా అభ్యర్థి బి.శ్రీరాములుకు మద్దతు ఇస్తానని తెలిపారు.

మోదీపై పోటీకి కాంగ్రెస్‌ అజయ్‌నే ఎందుకు ఎంచుకుంది..!

కర్ణాటకలో బీఎస్‌ యడియూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వంలో జనార్దన్‌రెడ్డి మంత్రిగా పనిచేశారు. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో జైలుపాలయ్యారు. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపాతో రెండు దశాబ్దాలకుపైగా ఉన్న అనుబంధాన్ని తెంచుకుని.. కొత్త పార్టీ వైపు మొగ్గుచూపారు. గంగావతి స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. హరపనహల్లి, బళ్లారి సిటీ నుంచి కమలదళం తరఫున పోటీ చేసిన తన సోదరులు కరుణాకరరెడ్డి, సోమశేఖరరెడ్డి ఓటమిలో కీలక పాత్ర పోషించారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో హస్తం పార్టీకి మద్దతు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు