Jeevan reddy: ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్‌ను మించిన నాయకుడు లేరు: జీవన్‌రెడ్డి

ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌ను మించిన నాయకుడు లేరని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Published : 24 Jul 2023 15:01 IST

హైదరాబాద్: ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌ను మించిన నాయకుడు లేరని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌.. ఇప్పుడు వారికి కొనేందుకు భూమి దొరకడం లేదంటున్నారని మండిపడ్డారు. దళిత బంధు పథకం కేవలం హుజూరాబాద్‌ ఉప ఎన్నికకే పరిమితం అయిందన్నారు. ఈ  మేరకు సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు.

‘‘రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 1500 మందికి దళితబంధు ఇస్తామని చెప్పారు. కానీ 2022-23 ఆర్థిక సంవత్సరం దాటినా ఇప్పటివరకు దళితబంధు ఇవ్వలేదు. దళితబంధుకు బడ్జెట్‌లో రూ. 17,700 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెప్పింది. కానీ, అమలు చేయలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క బీసీకి ఆర్థికంగా సహాయం చేయని ఏకైక ప్రభుత్వం కేసీఆర్ సర్కార్. బీసీల్లో కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే ఆర్థిక సహాయం అని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఎంత మంది బీసీలకు ఆర్థిక సాయం అందించారో ప్రభుత్వం చెప్పాలి. మైనారిటీ బంధు ఇస్తున్నామని ప్రభుత్వం జీవో జారీ చేసింది. గడిచిన ఐదేళ్లలో మైనారిటీ యాక్షన్ ప్లాన్ ఏమైంది? మైనారిటీలకు గతంలో రూ. 80 వేలు ఇస్తామని జీవో ఇచ్చారు... ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తామని మరో జీవో ఇచ్చారు.

తెలంగాణ వస్తే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని భావించాం. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే త్యాగం చేశారా? నిరుద్యోగులు, యువత పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది. మైనారిటీలను కేసీఆర్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. భాజపా అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. ముస్లిం రిజర్వేషన్లు మతపరమైనవి కావనేది గుర్తించాలి. ముస్లిం మైనారిటీల్లో సామాజికంగా వెనుకబడ్డ వారికి మాత్రమే రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతాం’’ అని జీవన్ రెడ్డి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని