Laxman: కేసీఆర్‌ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్‌ ట్యాపింగ్‌: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు.

Updated : 28 Mar 2024 13:50 IST

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియంతృత్వాన్ని పాటించే వాళ్లు నీడను కూడా నమ్మరన్నారు. కేసీఆర్‌ కూడా ఎవరినీ నమ్మలేదని.. అందుకే రాజకీయ, మీడియా ప్రముఖులపై ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించారని ఆరోపించారు. 

‘‘కేంద్ర హోం శాఖ అనుమతి లేకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో హార్డ్‌ డిస్కులు, సమాచారాన్ని ధ్వంసం చేశారు. రెండో, మూడో ఫోన్‌ ట్యాపింగ్‌లు జరిగితే జరగవచ్చని కేటీఆర్‌ అంటున్నారు. దీనికి మూల కారకులు కేసీఆర్‌, కేటీఆర్‌. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి దీనిపై సీబీఐ విచారణ చేయించాలి. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉంది. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో ఆ కుటుంబానికి ప్రమేయముంది. తెలంగాణ సంపదను దోచకున్న వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ నుంచి కదలలేదు. సచివాలయానికి ఒక్కసారి కూడా వెళ్లలేదు. గత ప్రభుత్వంలో ప్రతి పథకంలో స్కామ్‌లు చేశారు.. కమీషన్లు తీసుకున్నారు. ప్రశ్నించే వారిని బెదిరింపులకు గురి చేశారు. నియంతృత్వ పోకడలు సాగించారు. కక్ష సాధింపులో భాగంగా పలువురిపై ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారు. అసెంబ్లీ, ఉప ఎన్నికల సమయంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిచారు. ఈ కుంభకోణంలో కొంత మంది పోలీసు అధికారులు ఏ రకంగా అక్రమార్జనకు పాల్పడ్డారో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించింది. ఇది తీవ్రమైన నేరం’’ అని లక్ష్మణ్‌ ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని