Balakrishna: తెలుగు సినీ పరిశ్రమను వైకాపా నేతలు కించపరిచారు: బాలకృష్ణ

అసెంబ్లీలో తెలుగు సినిమా కళాకారులను వైకాపా ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు.

Updated : 21 Sep 2023 13:42 IST

అమరావతి: అసెంబ్లీలో తెలుగు సినిమా కళాకారులను వైకాపా ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని ఆయన గుర్తుచేశారు. సభలో తనకు మాత్రమే అవమానం జరగలేదని, మొత్తం తెలుగు సినీ పరిశ్రమని అధికార పార్టీ నేతలు కించపరిచారని ఆరోపించారు. శాసనసభలో సస్పెండ్ అనంతరం మల్కాపురం గ్రామంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు.

స్పీకర్ చేతా అబద్ధాలు చెప్పించారు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమమని, దీనిపై పోరాటం ఆపేది లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీసం మెలేసి, తొడ కొట్టిందీ వైకాపా ఎమ్మెల్యేలేనన్న ఆయన.. తాను చేయని పనిని చేసినట్లు అసత్యాలు సృష్టించారన్నారు. స్పీకర్ చేతా అబద్ధాలు చెప్పించారని దుయ్యబట్టారు. మంద బలంతో విర్రవీగుతున్న వైకాపా ఎమ్మెల్యేలకు తగిన మూల్యం తప్పదన్నారు. ప్రజలే వారికి త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు?: అచ్చెన్న

చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకొని.. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇదే నినాదంతో అసెంబ్లీకి వెళ్లామని తెలిపారు. ఇవాళ అసెంబ్లీకి ఒక దుర్దినమన్న అచ్చెన్న.. 200 మంది మార్షల్స్‌ను పెట్టి సభ జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. స్పీకర్ తీరు చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. మంత్రి నేరుగా మీసం మెలేసి బూతులు తిట్టినా ఎలాంటి చర్యలు లేవని దుయ్యబట్టారు.

జగన్ ఆస్తుల కేసు ప్రస్తావన రాకపోవడానికి ఏ ములాఖాత్ కారణం?

ములాఖాత్‌, మిలాఖాత్‌లతోనే పుట్టిన పార్టీ వైకాపా అని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. దిల్లీకి సీఎం వెళ్లి ఎవరితో ములాఖాత్‌, మిలాఖాత్ అవుతున్నారని ప్రశ్నించారు. దశాబ్ద కాలంగా జగన్ ఆస్తుల కేసు ప్రస్తావన రాకపోవడానికి ఏ ములాఖాత్, మిలాఖాత్‌ కారణమని నిలదీశారు. స్కిల్ కేసులో ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదన్నారు. 144 సెక్షన్, 30ఏ చట్టాలను అసెంబ్లీలోనూ సీఎం జగన్‌ అమలు చేస్తున్నారని తెదేపా శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపై వాస్తవాలు తెలియాలంటే.. తమ పవర్ పాయింట్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని