Nara Lokesh: రెండో రోజు సీఐడీ విచారణకు హాజరైన నారా లోకేశ్‌

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వరుసగా రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు.

Updated : 11 Oct 2023 11:00 IST

అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వరుసగా రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. 5 నిమిషాలు ముందే తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు. తొలిరోజు (మంగళవారం) ఆరున్నర గంటలపాటు సాగిన విచారణలో మొత్తం 50 ప్రశ్నలు అడిగారని.. వాటిలో 49 ప్రశ్నలు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుతో సంబంధం లేనివేనని లోకేశ్‌ వెల్లడించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని అంశాలపై సీఐడీ అధికారులు తనను ప్రశ్నించారని చెప్పారు.

సీఐడీ ప్రశ్నలకు లోకేశ్‌ సూటి సమాధానాలు!

మిగిలిన ప్రశ్నలకు కూడా మంగళవారమే సమాధానం చెప్తానన్నా.. సీఐడీ అంగీకరించలేదు. తాను న్యాయవాదులతో సంప్రదించేందుకు దిల్లీ వెళ్లాల్సి ఉన్నందున ఆలస్యమైనా సరే మిగతా ప్రశ్నలు అడగాలని లోకేశ్‌ కోరినా.. న్యాయస్థానం ఆదేశాల మేరకు 5 గంటలకే విచారణ ముగిస్తున్నామని సీఐడీ అధికారులు తెలిపారు. తన అంగీకారంతోనే 5 గంటల తర్వాత కూడా విచారణ కొనసాగించామని కోర్టుకు తెలియజేయొచ్చని లోకేశ్‌ కోరగా.. ప్రశ్నలు సిద్ధం చేసుకోవాల్సి ఉన్నందున ఇవాళ విచారిస్తామని దర్యాప్తు అధికారి చెప్పటంతో లోకేశ్‌ అందుకు అంగీకరించారు. మంగళవారం విచారణ ముగిశాక మళ్లీ 41A నోటీసు జారీ చేసిన సీఐడీ.. ఇవాళ కూడా విచారణకు పిలిచింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని