Karnataka: కన్నడనాట మిశ్రమ ఫలితం

కర్ణాటకలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, జేడీఎస్‌లకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. మొత్తంగా భాజపా పైచేయి సాధించినా.. గతం కంటే సీట్లు తగ్గాయి.

Published : 05 Jun 2024 05:50 IST

ఎన్డీయేదే పైచేయి అయినా తగ్గిన సీట్లు
కాస్త మెరుగుపడిన కాంగ్రెస్‌
హెచ్‌.డి.కుమారస్వామి

ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, జేడీఎస్‌లకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. మొత్తంగా భాజపా పైచేయి సాధించినా.. గతం కంటే సీట్లు తగ్గాయి. మరోవైపు అసెంబ్లీ స్థాయి ఫలితాలను కాంగ్రెస్‌ సాధించలేకపోయింది. అయితే గతం కంటే కాస్త మెరుగుపడింది. రాష్ట్రంలోని 28 స్థానాల్లో 17 చోట్ల భాజపా గెలిచింది. గత ఎన్నికలతో పోలిస్తే 8 స్థానాలను కోల్పోయింది. ఇక అధికారంలో ఉండీ రెండంకెల స్థానాలు గెలుచుకోలేని కాంగ్రెస్‌ నిరాశకు గురైంది. 2019లో కేవలం ఒక స్థానానికి పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి 9 స్థానాలను గెలుచుకుంది. భాజపాతో కలిసి పోటీ చేసిన జేడీఎస్‌ మూడింట పోటీ చేసి రెండు స్థానాలను గెలుచుకున్నా తమకు కంచుకోటగా ఉన్న హాసనను కోల్పోయి అసంతృప్తిని మిగుల్చుకుంది. 

లక్ష్యం చేర్చని ప్రచారాస్త్రం

అధికార పక్షం కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రం 5 గ్యారంటీ పథకాలే. వీటి ద్వారా కనీసం 20 స్థానాలైనా సాధిస్తామని కాంగ్రెస్‌ అంచనా వేసింది. కనీస పక్షంగా రెండంకెల స్థానాలైనా గెలుస్తామన్న ధీమాతో అడుగు ముందుకేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేర్చేందుకు గ్యారంటీలు ఉపకరించలేదని ఫలితాలు తేల్చాయి. ఎగ్జిట్‌ పోల్‌లో.. దాదాపు అన్ని సంస్థలు.. కాంగ్రెస్‌ పార్టీ కేవలం 3 నుంచి 5 స్థానాల్లో గెలుస్తుందన్న అంచనాలను ఈ ఫలితాలు తల్లకిందులు చేశాయి. బెంగళూరు పరిధిలోని 4 స్థానాలను కోల్పోవటం, అందులో 2019లో గెలిచిన ఏకైక స్థానం బెంగళూరు గ్రామీణలో ఓడిపోవటం కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ఈ స్థానంలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌ ఓడిపోయారు.

మేలు చేసిన మైత్రి

జేడీఎస్‌తో మైత్రి భాజపాకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఒక్కలిగ ప్రాబల్యం ఉన్న 7 స్థానాల్లో నాలుగింటిని భాజపా గెలుచుకోగా మిగిలిన 3 స్థానాల్లో మిత్రపక్షం జేడీఎస్‌ రెండు స్థానాలను సాధించింది. మరోవైపు భాజపాతో కలిసి పోటీ చేసిన జేడీఎస్‌కు ఈ ఎన్నికలు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి 5 స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానాన్ని గెలుచుకోగా, ఈసారి భాజపాతో కలిసి పోటీ చేసిన 3 స్థానాల్లో రెండింటిని సొంతం చేసుకోవటం విశేషం.


ప్రజ్వల్‌ ఓటమి

మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలతో ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్‌) కస్టడీలో ఉన్న హాసన సిటింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను ఈ ఫలితాలు మరింత కుంగదీశాయి. గత 25 ఏళ్లుగా జేడీఎస్‌కు కంచుకోటగా ఉంటూ.. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు రాజకీయ కేంద్రంగా మారిన హాసన ఈసారి కాంగ్రెస్‌ వశమైంది. ఏప్రిల్‌ 26న ఎన్నికలకు ముందు రోజు హాసనకు సంబంధించిన అశ్లీల వీడియో పెన్‌డ్రైవ్‌లు కలకలం సృష్టించాయి. ఈ ఆరోపణలే ప్రజ్వల్‌ ఓటమిని శాసించాయి. ఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజ్వల్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.శ్రేయస్‌ పటేల్‌ చేతిలో 43,739 ఓట్ల తేడాతో ఓడిపోయారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని