BJP Manifesto: మేనిఫెస్టోపై భాజపా కసరత్తు.. ప్రజల నుంచి 3 లక్షలకు పైగా సూచనలు!

భాజపా ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి 3 లక్షలకు పైగా సూచనలు అందాయని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్‌ మౌర్య అన్నారు.

Published : 01 Apr 2024 20:04 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ మేనిఫెస్టో రూపకల్పనపై భాజపా (BJP) కసరత్తు చేస్తోంది. పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో భాజపా ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ తొలిసారిగా సోమవారం సమావేశమైంది. ఈసందర్భంగా మేనిఫెస్టో కమిటీ సభ్యుడు, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టో కోసం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి 3 లక్షలకు పైగా సూచనలు, సలహాలు వచ్చాయని వెల్లడించారు. ఇది దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందన్నారు.  ఈమేరకు ఆయన ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడారు.

రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలో 27 మంది సభ్యులతో భాజపా మేనిఫెస్టో కమిటీ

ప్రజల నుంచి తాము స్వీకరించిన సూచనలు, సలహాలపై ప్యానల్‌లో చర్చించి త్వరలోనే డాక్యుమెంట్‌ను ఖరారు చేస్తామని మౌర్య తెలిపారు. భాజపా ఏం చెబుతుందో అదే చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. తమ పార్టీ చేయలేని పనుల్ని చెప్పదన్న ఆయన.. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు ప్రజల నుంచి సలహాలు కోరేందుకు ప్రత్యేక క్యాంపెయిన్‌ చేపట్టినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు తమకు సలహాలు, సూచనలు పంపించారన్నారు. నమో యాప్‌తో పాటు సలహాల కోసం ఏర్పాటుచేసిన నంబర్‌కు మిస్‌డ్‌కాల్‌ ఇచ్చిన వారి నుంచి సూచనలు స్వీకరించినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని