PM Modi: భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది: ప్రధాని మోదీ

దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్‌ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. పంజాబ్‌కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Published : 18 May 2024 19:25 IST

అంబాలా: దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే.. ఏదైనా చేసే ముందు శత్రువులు 100 సార్లు ఆలోచిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. తమ ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్‌లో ‘ఆర్టికల్‌ 370’ను రద్దు చేసిందని, ఇప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో హరియాణాలోని అంబాలాలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శిస్తూ.. ‘జీపు స్కామ్‌’ ఆ పార్టీ హయాంలో జరిగిన మొదటి కుంభకోణమని చెప్పారు. గతంలో బాంబులు చేతపట్టిన పాకిస్థాన్ ఇప్పుడు అదే చేతులతో యాచిస్తోందని గుర్తు చేశారు.

నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్‌ మధుర జ్ఞాపకాలు

సాయుధ బలగాల్లో హరియాణా నుంచి పెద్దసంఖ్యలో సైనికులు ఉండటాన్ని ప్రస్తావించిన మోదీ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జవాన్ల తల్లులు తమ పిల్లల భద్రత గురించి నిత్యం ఆందోళన చెందేవారన్నారు. ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని చెప్పారు. దేశంలో బలమైన సర్కారు ఉంటే శత్రువులు భయపడతారని పేర్కొన్నారు. దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్‌ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్‌.. పంజాబ్‌కు వచ్చేసరికి మాత్రం ‘ఝాడూవాలా చోర్‌ హై’ అంటూ మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. ఆరోవిడతలో భాగంగా ఈనెల 25న హరియాణాలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాల్లో ఒకేదశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని