Nara Lokesh: లోకేశ్‌ లక్ష్యంగా.. ‘కోడ్‌’ పేరుతో పదేపదే కాన్వాయ్‌ తనిఖీలు : తెదేపా

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని.. ఎన్నికల కోడ్‌ పేరుతో పోలీసులు పదేపదే ఆయన కాన్వాయ్‌ను తనిఖీ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

Updated : 24 Mar 2024 20:53 IST

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని.. ఎన్నికల కోడ్‌ పేరుతో పోలీసులు పదేపదే ఆయన కాన్వాయ్‌ను తనిఖీ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఉండవల్లి కరకట్ట వద్ద లోకేశ్‌ కాన్వాయ్‌ను పోలీసులు ఒకే రోజు రెండు సార్లు తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గత మూడు రోజుల్లో నాలుగు సార్లు కాన్వాయ్‌ ఆపి సోదాలు చేశారు. కోడ్‌ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని కాన్వాయ్‌లోని కార్లన్నింటినీ పరిశీలించారు. వాహనం దిగి లోకేశ్‌ కూడా సహకరించారు.

వైకాపా నేతల కార్లు ఎందుకు ఆపి సోదాలు చేయడం లేదని లోకేశ్‌ పోలీసుల్ని ప్రశ్నించారు. తెదేపా నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు. మంగళగిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొడానికి వెళ్తోన్న సమయంలో తనిఖీలు చేశారు. కాన్వాయ్‌లో కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ఆయన ప్రచారం సాగుతోందని నిర్ధరించారు.

తాడేపల్లి ఆదేశాల ప్రకారమే..

గత మూడు రోజుల్లో నాలుగుసార్లు లోకేశ్‌ కాన్వాయ్‌ను ఆపి తనిఖీ చేయడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేశ్‌ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. మార్చి 20న ఉదయం 8గంటలకు, 23న ఉదయం 8గంటలకు, 24న ఉండవల్లి కరకట్ట వద్ద ఉదయం ఉదయం 8.10 గంటలకు, సాయంత్రం 5గంటలకు కాన్వాయ్‌ ఆపి తనిఖీలు చేశారని తెలిపారు. వైకాపా ముఖ్య నాయకుల కాన్వాయ్‌లు ఎందుకు తనిఖీ చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికీ మంగళగిరిలో సీఎం జగన్‌ బొమ్మలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నా ఎందుకు తొలగించలేదని ధ్వజమెత్తారు. మంగళగిరి పోలీసులు తాడేపల్లి ఆదేశాల ప్రకారం నడుచుకోవడం మానుకోవాలని హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని