Madhya Pradesh: 225 నెలల భాజపా పాలనలో 250 స్కామ్‌లు.. ప్రియాంక ఆరోపణ

మధ్యప్రదేశ్‌లోని భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

Published : 12 Oct 2023 17:12 IST

మండ్లా: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పర్యటించారు. ఈ సందర్భంగా మండ్లాలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాజపా పాలనపై ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్‌లో గత 18ఏళ్ల భాజపా పాలనలో 250లకు పైగా స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసేలా కులగణన చేపట్టాలని ప్రియాంక డిమాండ్‌ చేశారు.  ఇటీవల బిహార్‌ కుల గణన చేపట్టిందని గుర్తు చేసిన ప్రియాంక.. అక్కడ 84శాతం ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలుకు చెందిన వర్గాల ప్రజలు ఉన్నారని తెలిపారు. కానీ, ఉద్యోగాల్లో మాత్రం వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు తెలిపారు. అందువల్ల ఆయా వర్గాల ప్రజల కచ్చితమైన సంఖ్య తెలుసుకొనేందుకు, వారికి న్యాయం చేయడానికి దేశంలో కుల గణన చేపట్టాలన్నారు. దాదాపు 18 ఏళ్ల పాలనలో భాజపా సర్కార్‌ ప్రజలకు చేసిందేమీ లేదని ప్రియాంక విరుచుకుపడ్డారు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు హామీలు ప్రకటిస్తారంటూ విమర్శించారు.  వ్యాపమ్‌, మధ్యాహ్న భోజనం, స్కాలర్‌షిప్‌లతో పాటు దాదాపు 225 నెలల పాలనా కాలంలో 250 కుంభకోణాలు జరిగాయని ప్రియాంక ఆరోపించారు.  

119 నియోజకవర్గాల్లో పోటీకి వైతెపా సై.. పాలేరు బరిలో షర్మిల

ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ ప్రజలకు ఎన్నికల హామీలను ప్రకటించారు. పాత పింఛను విధానం అమలు చేయడంతో పాటు ₹500లకే గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ, రైతులకు రుణమాఫీ, కులగణన, మహిళలకు ప్రతి నెలా 1500లు, 100 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 200 యూనిట్లు దాటితే సగం ఛార్జీ, వెనుకబడిన వారికి 27శాతం రిజర్వేషన్లు, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద గ్రామాల్లో ఇచ్చే సాయం పట్టణప్రాంతాలతో సమానంగా ఇస్తామని ప్రకటించారు. అలాగే, మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.500, 9 నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.1000, 11, 12వ తరగతి విద్యార్థులకు రూ.1500ల చొప్పున స్కాలర్‌షిప్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని