AP Election: ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, వైకాపాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగినప్పటికీ మొగ్గు తెదేపావైపే కనిపిస్తోందని దిల్లీలోని ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ (సీఎస్‌డీఎస్‌)కు చెందిన సీనియర్‌ సెఫాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ సంజయ్‌కుమార్‌ తెలిపారు.

Updated : 21 May 2024 06:44 IST

తెలంగాణలో భాజపా, కాంగ్రెస్‌ మధ్యే పోటీ
ప్రముఖ సెఫాలజిస్ట్‌ సంజయ్‌కుమార్‌ అంచనా

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, వైకాపాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగినప్పటికీ మొగ్గు తెదేపావైపే కనిపిస్తోందని దిల్లీలోని ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ (సీఎస్‌డీఎస్‌)కు చెందిన సీనియర్‌ సెఫాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ సంజయ్‌కుమార్‌ తెలిపారు. భాజపాకు ఆంధ్రప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్‌ లేనప్పటికీ, తెదేపాతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీ కొన్ని సీట్లు గెలుచుకుంటుందని ఆయన వెల్లడించారు. సీఎస్‌డీఎస్‌లో ‘ఎలక్టోరల్‌ పాలిటిక్స్‌’పై పరిశోధనలు చేసే లోక్‌నీతి ప్రాజెక్టుకు కో-డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆయనతో ఆన్‌లైన్‌ వార్తా సంస్థ ‘ఎడిటర్‌జీ’ వ్యవస్థాపకుడు, సీనియర్‌ పాత్రికేయుడు విక్రమ్‌ చంద్ర... తాజా రాజకీయ పరిణామాలపై సోమవారం ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో భాజపా పరిస్థితిపై ప్రధానంగా చర్చించారు.

జనవరి-ఫిబ్రవరితో పోలిస్తే ప్రస్తుతం ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు చాలా వేగంగా మారిపోయాయని సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. అప్పట్లో భాజపాకు సొంతంగా 370 స్థానాలు వస్తాయా.. లేదా? అన్న చర్చ నుంచి.. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీని భాజపా సొంతంగానే సాధిస్తుందా? లేక ఎన్డీయే పక్షాలతో కలిసి సాధిస్తుందా? అన్న చర్చ సాగే దిశగా పరిణామాలు మారాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే బలమైన జాతీయస్థాయి అంశాల్లేవని, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ అంశాలు, ఆకాంక్షలే ప్రధానంగా నిలుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

  • రామమందిరం, ఆర్టికల్‌ 370, ప్రపంచంలో భారతదేశం ప్రతిష్ఠ వంటివి ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలవుతాయని ఒకప్పుడు అంచనా వేశామని.. కానీ ఇప్పుడు రాజ్యాంగం, సామాజిక న్యాయం వంటి అంశాల ఆధారంగా ఓటర్లు తమ అభిప్రాయాల్ని మలుచుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్రాల వారీగా భాజపా పరిస్థితిపై సంజయ్‌కుమార్‌ అంచనాలు ఇలా ఉన్నాయి.
  • తెలంగాణలో భాజపా, కాంగ్రెస్‌ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. 2019తో పోలిస్తే భాజపాకు కొన్ని స్థానాలు పెరిగే అవకాశం ఉంది. 
  • కర్ణాటకలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడం, ఆ పార్టీకి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిగా బలమైన నాయకులు ఉండటం వంటి కారణాలతో.. గత ఎన్నికలతో పోలిస్తే భాజపా సీట్లు తగ్గుతాయి. 
  • ఒడిశాలో భాజపా కొంత బలపడుతుంది. సీట్లూ పెరుగుతాయి.
  • బిహార్‌లో భాజపాకు ఇబ్బంది ఉండకపోవచ్చు. 2019తో పోలిస్తే ఆ పార్టీకి సీట్లు తగ్గకపోవచ్చు. అక్కడ భాజపా మిత్రపక్షమైన జేడీ(యు) అధినేత నితీశ్‌కుమార్‌.. తరచూ మిత్రుల్ని మార్చేయడం వల్ల ఆయన ప్రతిష్ఠ మసకబారింది. అది ఆ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. 
  • మహారాష్ట్రలో భాజపాకు ఇబ్బంది లేకపోవచ్చు. కానీ అక్కడ గత ఎన్నికలతో పోలిస్తే ఎన్సీపీ, శివసేన చీలిపోవడం వల్ల.. ఎన్డీయే సీట్లు కోల్పోతుంది.  
  • బెంగాల్‌లో భాజపాకు, టీఎంసీకి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుగా ఉంది. ఇంకా అక్కడ రెండు దశల పోలింగ్‌ జరగాల్సి ఉన్నందున ఏ పార్టీ ఆధిపత్యం సాధిస్తుందో అంచనా వేయలేం.
  • గత ఎన్నికలతో పోలిస్తే హరియాణా, రాజస్థాన్‌లలో భాజపా కొన్ని స్థానాలు కోల్పోతుంది. దిల్లీలో పోటీ తీవ్రంగా ఉంటుంది.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా రామమందిరం అంశం ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపట్లేదు. అక్కడ కులాలు, దళితుల అంశాలు, పొత్తులు, సామాజిక న్యాయం వంటివి ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ, ఉచిత రేషన్‌ పథకం వంటివి భాజపాకు మేలు చేస్తాయి. పేదలు ఎక్కువగా ఆ పార్టీ వైపు ఉన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని