సీట్ల సర్దుబాటు వేళ.. ఉద్ధవ్‌ వర్గం, కాంగ్రెస్‌ మధ్య ‘కిచిడీ’ చిచ్చు

ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) వర్గం నేతపై కాంగ్రెస్‌ నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Updated : 27 Mar 2024 15:38 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లో మహావికాస్ అఘాడీ (MVA)లో చీలికలు బయటపడ్డాయి. శివసేన (యూబీటీ)పై కాంగ్రెస్ (Congress) నేత సంజయ్‌ నిరుపమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిచిడీ ఛోర్ అంటూ మండిపడ్డారు.

మహారాష్ట్ర (Maharashtra) మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేన (యూబీటీ) బుధవారం తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఎంపీ గంజనన్‌ కీర్తికర్‌ కుమారుడు అమోల్‌కు తాజా జాబితాలో చోటు దక్కింది. వాయువ్య ముంబయి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ ప్రకటన అనంతరం నిరుపమ్ మీడియాతో మాట్లాడుతూ అమోల్‌కు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘శివసేన(యూబీటీ) కిచిడీ చోర్‌కు టికెట్‌ ఇచ్చింది. అలాంటి అభ్యర్థుల కోసం మేం పనిచేయం’ అని తేల్చి చెప్పారు.

ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్‌ రేపు కోర్టులో చెబుతారు: సతీమణి సంచలన ప్రకటన

మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిలో 44 స్థానాలకు మహా వికాస్‌ అఘాడీ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. ఇందులో భాగంగా శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్‌ 16, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 సీట్లను కేటాయించారు. మిగతా నాలుగు స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. అయితే, తాము మొత్తం 22 స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌రౌత్‌ తాజాగా ప్రకటించడం కూడా కూటమిలో అసంతృప్తికి దారితీస్తోంది. ఈ సీట్ల ప్రకటన తర్వాతే వంచిత్ బహుజన్ అఘాడీ.. ఎంవీఏను వీడింది.  

కిచిడీ స్కామ్‌లో అమోల్‌ కీర్తికర్‌కు సమన్లు

ఠాక్రే వర్గం అమోల్‌కు టికెట్‌ ఇచ్చిన రోజునే.. కిచిడీ కుంభకోణంలో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కరోనా కాలంలో వలస కూలీలకు కిచిడీ పంపిణీ చేసేందుకు ఇచ్చిన కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఆ కుంభకోణం విచారణలో భాగంగా తాజాగా చర్యలు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని