Sachin Pilot: గహ్లోత్‌ విభేదాలకు చెక్‌..! సచిన్‌ పైలట్‌ కీలక ప్రకటన

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌తో విభేదాలకు ముగింపు పలుకుతున్నట్లు సచిన్‌ పైలట్‌ తెలిపారు. 2018లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య అధికార పోరు సాగుతోన్న విషయం తెలిసిందే.

Published : 08 Jul 2023 19:10 IST

జైపుర్: రాజస్థాన్‌ (Rajasthan)లో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలంటే మొదట గుర్తుకొచ్చేది సీఎం అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot), మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ (Sachin Pilot)ల మధ్య విభేదాలే! త్వరలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఈ వ్యవహారం అధిష్ఠానానికీ తలనొప్పిగా మారింది. ఈ తరుణంలోనే సచిన్‌ పైలట్‌ కీలక ప్రకటన చేశారు. గహ్లోత్‌తో సాగుతోన్న వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సన్నాహాలపై కాంగ్రెస్‌ (Congress) అధినాయకత్వం సమావేశం నిర్వహించిన రెండు రోజుల్లోనే పైలట్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సలహా మేరకు నడచుకుంటున్నానని.. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సమష్టి నాయకత్వమే ఏకైక మార్గమని పేర్కొన్నారు. పార్టీలో పూర్తి ఐక్యత ఉంటేనే.. ఎన్నికల్లో విజయం సాధించగలమని కాంగ్రెస్‌ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

‘గతంలో జరిగిన విషయాలను క్షమించి, మరచిపోవాలని.. వాటిని వదిలేసి ముందుకు సాగాలని ఖర్గే ఇటీవల సలహా ఇచ్చారు. ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని నమ్ముతున్నా’ అని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్‌ పైలట్‌ తెలిపారు. ‘గహ్లోత్‌ నాకన్నా పెద్దవారు. ఆయనకు అనుభవం ఎక్కువ. ఆయన భుజాలపై పెద్ద బాధ్యతలున్నాయి. నేను రాజస్థాన్ పీసీసీ చీఫ్‌ ఉన్న సమయంలో అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నించాను. ప్రస్తుతం గహ్లోత్‌ అదే చేసేందుకు యత్నిస్తున్నారు. చిన్నచిన్న విభేదాలుంటే అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వ్యక్తికన్నా.. పార్టీ, ప్రజలే ముఖ్యం. ఇద్దరం ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాం’ అని అన్నారు. ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే మా తదుపరి లక్ష్యం. వ్యక్తులు, వారు చేసిన వ్యాఖ్యలు ముఖ్యం కాదు. అది ముగిసిన అధ్యాయం’ అని వ్యాఖ్యానించారు.

‘ఏ నిర్ణయమైన శిరోధార్యం.. అయితే..!’

‘ఇప్పుడు మేమంతా కలిసికట్టుగా ముందుకు సాగుతూ.. కొత్త సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ దేశానికి కాంగ్రెస్ చాలా అవసరం. మాకు రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం కావాలి. ఇది పొందాలంటే.. పార్టీ శ్రేణులతోపాటు ప్రజలకు ఆమోదయోగ్యమైన విధంగా ఐక్యతతో ముందుకెళ్లాల్సి ఉంటుంది’ అని పైలట్ అన్నారు. పార్టీలో ఎటువంటి పాత్ర పోషించనున్నారని ప్రశ్నించగా.. గతంలో తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించానని, పార్టీ హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయమైనా తనకు శిరోధార్యమని చెప్పారు. అయితే, రాజస్థాన్‌తో తనకు ఎనలేని అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న పార్టీని తదుపరి ఎన్నికల్లో ఓడించే సంప్రదాయాన్ని తిరగరాసి, మరిన్ని సీట్లతో గెలుపొందుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లో 2018లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి గహ్లోత్‌, పైలట్‌ల మధ్య అధికార పోరు సాగుతోంది. 2020లో సీఎం గహ్లోత్‌పై అసమ్మతి స్వరం వినిపిస్తూ అప్పట్లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న సచిన్‌ పైలట్‌తోపాటు మరో 18మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దాదాపు నెలరోజులపాటు ఈ రాజకీయ ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు పార్టీ అధిష్ఠానంతో చర్చల అనంతరం.. కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ఆయన ప్రకటించారు. గతేడాది కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళా.. రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. మరోవైపు గహ్లోత్‌పై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్న పైలట్‌.. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర కూడా చేపట్టారు. గత భాజపా ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ పరిణామాలు పార్టీని కలవరపెట్టినప్పటికీ.. తాజా నిర్ణయంతో ఊరట లభించినట్లయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు