Congress: ‘ఐక్యత ఉంటేనే విజయం..!’ గహ్లోత్‌- పైలట్‌ వివాదంపై రాని స్పష్టత

పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా ఉంటేనే వచ్చే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. రాజస్థాన్‌ ఎన్నికలపై గురువారం సమావేశం నిర్వహించింది.

Published : 06 Jul 2023 20:14 IST

దిల్లీ: పార్టీలో పూర్తి ఐక్యత (Unity) ఉంటేనే.. రానున్న రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నిక (Rajasthan Elections)ల్లో విజయం సాధించగలమని కాంగ్రెస్‌ (Congress) పేర్కొంది. ఈ విషయాన్ని నేతలంతా అంగీకరించినట్లు తెలిపింది. సెప్టెంబర్ మొదటి వారంలోగా అభ్యర్థులను ఖరారు చేస్తామని, గెలుపు గుర్రాలకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించింది. రాజస్థాన్‌ (Rajasthan)లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సన్నద్ధతపై చర్చించేందుకు పార్టీ అధినాయకత్వం గురువారం సమావేశమైంది. సమావేశం అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (K C Venugopal) మీడియాకు వివరాలు వెల్లడించారు. క్రమశిక్షణ పాటించని నేతలు, పార్టీ ఫోరం వెలుపల మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎవరి నాయకత్వంలో పోటీ చేస్తుందన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాము ఎప్పుడూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించబోమని, ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడతామని చెప్పారు. సీఎం అశోక్‌ గహ్లోత్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ల మధ్య కొనసాగుతున్న వివాదంపై చర్చిస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలంతా ఇంటింటికి తిరుగుతారని, శుక్రవారం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ ఇన్‌ఛార్జి సుఖ్‌జిందర్ రంధావా, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గోవింద్ దోతస్రా, సీఎం గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ తదితరులు పాల్గొన్నారు.

సంప్రదాయాన్ని తిరగరాయడంపైనే చర్చ..!

అధికారంలో ఉన్న పార్టీని తదుపరి ఎన్నికల్లో ఓడించే సంప్రదాయాన్ని ఎలా తిరగరాయాలన్న దానిపై చర్చించినట్లు సచిన్‌ పైలట్‌ తెలిపారు. ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పోరాడి రాజస్థాన్‌లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత భాజపా ప్రభుత్వ అవినీతి, పేపర్ లీకేజీ తదితర సమస్యలతోపాటు యువతకు సంబంధించిన అంశాలను సమావేశంలో లేవనెత్తానని.. పార్టీ అధిష్ఠానం వాటిని పరిగణనలోకి తీసుకుందని వెల్లడించారు. భాజపా హయాంలో జరిగిన అవినీతి విషయంలో తమ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని.. ‘అవినీతి’ని ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారుస్తామని చెప్పారు. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలిచిందని, ఇది పునరావృతం అవుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని