Siddaramaiah-DK: కొలువుదీరిన శివరామయ్య రాజ్యం.. సిద్ధూ, డీకే ప్రమాణ స్వీకారం

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ (DK Shivakumar) ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు, పలు రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతల సమక్షంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

Updated : 20 May 2023 13:26 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ (DK Shivakumar) ప్రమాణం చేశారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ వీరి చేత ప్రమాణం చేయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), అగ్రనేతలు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanaka Gandhi) సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్‌, ప్రియాంక గాంధీకి శివకుమార్‌ స్వయంగా సాదర స్వాగతం పలికారు. దగ్గరుండి వారిని వేదిక వద్దకు తీసుకొచ్చారు.

మంత్రులుగా ఎనిమిది మంది..

సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో ఎనిమిది మంది కేబినెట్‌ మంత్రులు (Cabinet Ministers)గా ప్రమాణస్వీకారం చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర, కె.హెచ్‌ మునియప్ప, కె.జె. జార్జ్‌, ఎం.బి. పాటిల్‌, సతీశ్ జర్ఖిహోళి, ప్రియాంక్‌ ఖర్గే, రామలింగారెడ్డి, బి.జడ్‌. జమీర్‌ అహ్మద్ ఖాన్‌ చేత గవర్నర్‌ థావర్‌చంద్ గహ్లోత్‌ మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్‌కు కేబినెట్‌లో చోటు దక్కింది. ఇక అన్ని వర్గాల వారికీ సమప్రాధాన్యం కల్పించేలా కేబినెట్‌లో మంత్రి పదవులను కేటాయించినట్లు కాంగ్రెస్‌ తెలిపింది.

ఇదీ చదవండి: స్వయంకృషికి చిరునామా సిద్ధరామయ్య 

సీఎంలు.. మాజీ సీఎంలు

ప్రమాణస్వీకార కార్యక్రమానికి తమిళనాడు, రాజస్థాన్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్‌, అశోక్‌ గహ్లోత్‌, నీతీశ్ కుమార్‌, భూపేశ్‌ బఘేల్‌, సుఖ్వీందర్‌ సింగ్‌ సుక్కు, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, సినీ నటుడు, మక్కల్‌ నీది మయం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ తదితరులు హాజరయ్యారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్ ‘తీర్పు’.. తలవంచిన వీరవిధేయుడు: డీకే శివకుమార్‌ ప్రస్థానమిదీ..

ఇటీవల జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో (Karnataka Assembly elections) కాంగ్రెస్‌ 135 స్థానాలతో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ (Congress) పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. సుదీర్ఘ మంతనాల తర్వాత పార్టీ ప్రయోజనాలు, సీనియార్టీని దృష్టిలో పెట్టుకుని అధిష్ఠానం సిద్ధరామయ్య (Siddaramaiah) వైపు మొగ్గుచూపింది. డీకే శివకుమార్‌ (DK Shivakumar)కు సర్దిచెప్పి ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. కాగా.. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పగ్గాలు అందుకోవడం ఇది రెండోసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని