Dk shivakumar: కాంగ్రెస్ ‘తీర్పు’.. తలవంచిన వీరవిధేయుడు: డీకే శివకుమార్‌ ప్రస్థానమిదీ..

కర్ణాటకలో (karnataka) ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్‌ ఎట్టకేలకు ఏకాభిప్రాయానికి వచ్చింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎన్నుకున్న హైకమాండ్‌.. డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది. పార్టీకి నమ్మినబంటుగా ఉన్న డీకే.. అధిష్ఠానం నిర్ణయాన్ని అంగీకరించడంతో దీనికి తెరపడింది.

Updated : 18 May 2023 15:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘కోర్టులో మనం ఎంతైనా వాదిస్తాం. కానీ చివరకు న్యాయమూర్తి చెప్పింది పాటించాల్సిందే. హైకమాండ్‌ ఆదేశం కూడా నాకు కోర్టు తీర్పులాంటిదే’’.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక తర్వాత పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ చెప్పిన మాటలివి. అవును మరి.. కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడిగా ఉన్న డీకే.. అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాలకు తలవంచి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు అంగీకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన ఆయన సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్యతో తీవ్రంగా పోటీపడినప్పటికీ.. చివరకు పార్టీ కోసం పదవిని ‘త్యాగం’ చేశారు. పార్టీపై తనకున్న విధేయత చాటుకున్నారు. 

  1. ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన శివకుమార్‌ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రాజకీయాలపై (Politics) ఆసక్తితో విద్యార్థి దశలోనే కాంగ్రెస్‌లో చేరారు. అదే పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పీసీసీ అధ్యక్ష  (pcc president) పదవి పొందారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు డీకేకు పార్టీ.. పార్టీకి డీకే అండగా నిలిచారు. 
  2. డీకే శివకుమార్‌ 1985లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలిసారి సాథనూరు నుంచి దేవెగౌడపై పోటీ చేసి ఓడిపోయారు. 1989లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1990లో సీఎంగా ఉన్న వీరేంద్రపాటిల్‌ సీఎం పదవి నుంచి దిగిపోయారు. అనంతరం కొత్తగా ఏర్పడిన ఎస్‌.బంగారప్ప మంత్రివర్గంలో డీకేకు చోటు దక్కింది. అప్పటికి ఆయన వయసు 30 సంవత్సరాలు. ఆ తరువాత నుంచి డీకే పరాజయం ఎరుగని నేతగా ఎదిగారు. 1989 నుంచి ఇప్పటివరకు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 8 సార్లు విజయం సాధించారు. 
  3. 1999లో జేడీఎస్‌ నేత కుమారస్వామిని ఓడించి సాథనూరును తన కంచుకోటలా మలుచుకున్నారు. అయితే ఈ విజయం దేవెగౌడ కుటుంబానికి, డీకేకు మధ్య రాజకీయ వైరం పెంచింది. డీకేకు ‘జెయింట్ కిల్లర్‌’ అని పేరువచ్చింది. ఆ తరువాత ఎస్.ఎం కృష్ణ మంత్రి వర్గంలో అర్బన్‌ డెవలప్‌మెంట్ అండ్‌ కార్పొరేషన్‌ మంత్రిగా 2004 వరకు కొనసాగారు. అప్పటి నుంచే డీకే దశ తిరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
  4. 2004లో ధరమ్‌సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది.  శివకుమార్‌కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. 2008లో తన సొంత నియోజకవర్గం సాథనూరును వీడి కనకాపుర నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటివరకూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2013లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మంత్రివర్గంలో డీకేకు చోటు దక్కింది.
  5. సంక్షోభ సమయంలో పావులు కదపడంలో డీకే సిద్ధహస్తుడు. ఆయన ప్రతిభను గుర్తించిన అధిష్ఠానం పలుమార్లు పార్టీ ఎమ్మెల్యేలను రక్షించే బాధ్యతను అప్పగించింది. 2002లో విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ మహారాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో ఆయనపై కొందరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దాంతో మహారాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలకు డీకే ఆశ్రయం కల్పించి అవిశ్వాస తీర్మానం నుంచి విలాస్‌రావ్‌ గట్టెక్కేందుకు సహాయపడ్డారు.
  6. 2017లో రాజ్యసభ ఎంపీగా అహ్మద్‌ పటేల్‌ గెలుపొందేందుకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గుజరాత్‌ ఎమ్మెల్యేలకు మరోసారి తన రిసార్టులో ఆశ్రయం కల్పించారు. అనూహ్యంగా ఆ సమయంలో ఐటీ సోదాలు జరిగాయి. 2018లో కర్ణాటకలో కాంగ్రెస్‌ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరిపడా స్థానాలు రాలేదు. దాంతో జేడీఎస్‌ సాయంతో ప్రభుత్వాన్ని నెలకొల్పడంతో డీకే కీలక భూమిక వహించారు. దేవెగౌడ కుటుంబంతో ఉన్న రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకొని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు తన వంతు సహకారం అందించారు.
  7. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంది. సమర్థ నాయకత్వం అవసరమని భావించిన అధిష్ఠానం పీసీసీ బాధ్యతలను శివకుమార్‌కు కట్టబెట్టింది. కష్టకాలంలో పార్టీ పగ్గాలు అందుకున్న డీకే.. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించారు. పార్టీని ఏకతాటిపైకి తెచ్చి బలోపేతం చేశారు. అందుకు ఫలితమే.. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ 135 స్థానాలు గెలుచుకుంది.
  8. రూ.1,358 కోట్ల ఆస్తులు: డీకే.. ఇటీవల సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తులను రూ.1358 కోట్లుగా పేర్కొన్నారు. ఆదాయపు పన్ను, ఈడీ, సీబీఐ సంస్థల కన్ను తనపై ఉందని తెలిసి కూడా ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను ప్రకటించడం ఓ సంచలనమని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2019లో ఓ మనీ లాండరింగ్‌ కేసులో డీకే అరెస్టయి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.
  9. ‘‘నేను ఎప్పుడు పార్టీ గీసిన గీత దాటలేదుగా. కాంగ్రెస్‌ పార్టీ నాకు కన్నతల్లిలాంటిది. నేను పార్టీకి వెన్నుపోటు పొడవలేను. బ్లాక్‌మొయిల్‌ రాజకీయాలు చేయలేను. అలాంటివి చేసి తప్పుడు చరిత్ర సృష్టించడం నా వల్ల కాదు’’ అంటూ సీఎం ఎంపికకు చర్చలు జరుగుతున్న సమయంలో శివకుమార్‌ పార్టీపై తనకున్న విశ్వాసాన్ని మరోసారి బయటపెట్టారు.
  10. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శివకుమార్‌ నమ్మిన బంటు. తాజాగా సీఎం ఎంపిక విషయంలో అధిష్ఠానం సిద్ధరామయ్య వైపు మొగ్గుచూపడంతో డీకే కాస్త బెట్టుగా వ్యవహరించారు. కానీ, చివరకు సోనియా గాంధీ సూచనతో ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అంగీకరించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని