Karnataka CM: సీఎంగా సిద్ధరామయ్యే.. డీకేకు డిప్యూటీ పదవి: కాంగ్రెస్‌ అధికారిక ప్రకటన

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య (Siddaramaiah) ఎంపికయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ కొనసాగనున్నారు.

Updated : 18 May 2023 13:47 IST

దిల్లీ: కర్ణాటక (Karnataka) నూతన ముఖ్యమంత్రి (Chief Minister) ఎంపికలో ఐదు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత సిద్ధరామయ్యను కాంగ్రెస్‌ ఎంచుకుంది. ఇక, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ను ఖరారు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత పార్టీలో ఏకాభిప్రాయం కుదిరింది. అనంతరం గురువారం మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ రణ్‌దీప్‌ సుర్జేవాలా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఏఐసీసీ నిర్ణయాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ‘‘కర్ణాటక విజయం కాంగ్రెస్‌కు ఉత్సాహాన్నిచ్చింది. ఇందుకోసం పార్టీ హైకమాండ్‌తో పాటు నేతలందరూ ఎంతో కృషి చేశారు. మాది ప్రజాస్వామ్య పార్టీ. నియంతృత్వం కాదు.. ఏకాభిప్రాయంపై మాకు నమ్మకం ఉంది. కర్ణాటక కాంగ్రెస్‌లో గొప్ప నేతలున్నారు. ఈ నెల 14న కర్ణాటక శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాం. అందులో సీఎం ఎవరనేదానిపై ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించాం. అనంతరం సీఎంగా సిద్ధరామయ్య పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. ఇక రాష్ట్ర ఏకైక ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ బాధ్యతలు చేపడుతారు. దీంతో పాటు రాష్ట్ర పీసీసీ అధ్యక్ష బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తారు. వచ్చే ఏడాది పార్లమెంట్‌ ఎన్నికల వరకు డీకే ఈ బాధ్యతల్లో కొనసాగుతారు’’ అని వెల్లడించారు.

మే 20న ప్రమాణస్వీకారం..

గురువారం రాత్రి బెంగళూరులో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కర్ణాటక నూతన ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు అధికారికంగా ఎన్నుకుంటారు. అనంతరం తమ నిర్ణయాన్ని గవర్నర్‌కు అందజేస్తారని కాంగ్రెస్‌ తెలిపింది. మే 20న నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు వెల్లడించింది.

సోనియా బుజ్జగింపులతో..

సీఎం పదవి కోసం సీనియర్‌ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్‌ (Congress)కు క్లిష్టంగా మారింది. ఈ క్రమంలోనే సుదీర్ఘ మంతనాలు జరిపిన పార్టీ హైకమాండ్‌.. సీఎంగా సిద్ధరామయ్య వైపే మొగ్గుచూపింది. అయితే, దీనికి అంగీకరించని డీకే శివకుమార్‌.. తొలుత తన బెట్టు కొనసాగించారు. ఈ క్రమంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే బుధవారం అర్ధరాత్రి దాటే వరకు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. అటు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా (Sonia Gandhi), రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కూడా డీకేతో మాట్లాడారు. శివకుమార్‌ డిప్యూటీ సీఎం పదవి తీసుకునేలా సోనియా.. ఆయనను బుజ్జగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ప్రయోజనాల కోసం అధిష్ఠానం నిర్ణయాన్ని అంగకరించానని డీకే శివకుమార్‌ ఈ సందర్భంగా తెలిపారు. తనపై మరింత బాధ్యత పెరిగిందని ఆయన అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని