Sonia Gandhi: రాజ్యసభకు సోనియా.. రాయ్‌బరేలీ నుంచి బరిలో ప్రియాంక ?

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ రాజ్యసభకు నామినేట్‌ కాబోతున్నారనే ఊహానాగాలు కొనసాగుతున్నాయి. అలాగైతే, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది.

Updated : 12 Feb 2024 20:43 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) రాజ్యసభకు నామినేట్‌ కాబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల నుంచి వైదొలిగి తన కుమార్తె ప్రియాంకా గాంధీని (Priyanka gandhi) రంగంలోకి దించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు సోనియాను తమ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాలని కోరుతున్న వేళ ఆమె రాజస్థాన్‌ నుంచి నామినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2006 నుంచి సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ అదే జరిగితే  ఆమె తొలిసారి ఎన్నికల బరిలో నిలిచే స్థానం ఇదే కానుంది. రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు మంచి పట్టున్న సీటు. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనంతో అమేఠీలో రాహుల్‌ ఓటమి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు తీవ్ర ప్రతికూలతలు ఎదురైనా రాయ్‌బరేలీలో మాత్రం హస్తం పార్టీ తట్టుకొని నిలబడింది. అయితే, సోనియా గాంధీ రాజ్యసభకు నామినేట్‌ కాబోతున్నారనే అంశంపై ఇప్పటివరకు ఊహాగానాలే తప్ప ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

బల పరీక్షలో నీతీశ్‌ విజయం.. విపక్షం వాకౌట్‌

ఎన్నో ఏళ్లుగా ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చూస్తోన్న ప్రియాంకకు ఇది సురక్షితమైన సీటుగా కాంగ్రెస్‌ భావిస్తోంది. 1950ల నుంచి ఇది కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట. తొలుత ఆమె తాత ఫిరోజ్‌గాంధీ ఇక్కడినుంచే విజయం సాధించారు.  2019 జనవరిలో అధికారికంగా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రియాంకగాంధీ ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనే పోటీ చేస్తారని అంతా భావించారు. వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీతో తలపడతారని ప్రచారం జరిగింది. అయితే, ఆ సమయంలో పార్టీకి సారథ్యం వహించిన రాహుల్‌గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీని పునరుద్ధరించే బాధ్యతను ఆమెకు అప్పగించారు. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా చేతిలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పలేదు.

రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాలని సోనియాను కోరిన మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌

ఇదిలాఉండగా..  సోనియాగాంధీ తమ రాష్ట్రం నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాలని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు. ఇటీవల మాజీ సీఎం కమల్‌నాథ్‌ ఆమెను దిల్లీలో కలిసి తమ పార్టీ రాష్ట్ర శాఖ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ సోమవారం వెల్లడించారు. గతంలో ప్రధాని పదవిని తిరస్కరించిన సోనియా ఇక్కడినుంచి రాజ్యసభకు వెళ్తే ప్రజల గొంతుక బలపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కమల్‌నాథ్‌కు రాజ్యసభ సభ్యుడిగా ఆసక్తి ఉంటే తాము మద్దతిస్తామన్నారు. మధ్యప్రదేశ్‌లో ఐదు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ నాలుగు సీట్లలో భాజపా పోటీ చేస్తుండగా.. ఒకచోట ప్రతిపక్ష కాంగ్రెస్‌ బరిలో నిలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని