Bihar: బల పరీక్షలో నీతీశ్‌ విజయం.. విపక్షం వాకౌట్‌

బిహార్‌ అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో నీతీశ్‌ కుమార్‌ నెగ్గారు. 129 మంది ఎమ్మెల్యేలు ఆయన ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.

Updated : 12 Feb 2024 16:14 IST

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్ష (Trust Vote)లో మొత్తం 129 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలిచారు. విపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీ మార్క్‌ 122.

అంతకుముందు ఆర్జేడీకి చెందిన స్పీకర్‌ అవధ్‌ బిహారీ చౌధరీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సైతం 125- 112 ఓట్లతో నెగ్గింది. ఆ సమయంలో ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్డీయే పక్షం వైపు కూర్చోవడంపై తేజస్వీ అభ్యంతరం వ్యక్తంచేశారు. పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ను లేవనెత్తగా.. డిప్యూటీ స్పీకర్‌ మహేశ్వర్‌ హజారీ తిరస్కరించారు. త్వరలోనే నూతన స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.

నీతీశ్‌ కుమార్‌ను తాను ఎప్పుడూ తండ్రిలాగే భావించానని, ‘మహాగఠ్‌బంధన్’ నుంచి వైదొలిగి ఎన్డీయేలోకి తిరిగి చేరేందుకు ఆయన్ను ఏ కారణాలు బలవంతం చేశాయో తనకు తెలియదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బిహార్‌లోని మహాకూటమి ప్రభుత్వాన్ని చూసి భాజపా భయపడింది. నీతీశ్‌ మరోసారి కూటమి మారబోరని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వగలరా?’’ అని ప్రశ్నించారు.

జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ గత నెల 28న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్జేడీతో కలిసి ఆయన ఏర్పాటుచేసిన మహాకూటమి ప్రభుత్వం పతనమైంది. అనంతరం భాజపాతో జట్టు కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అదేరోజు ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి ప్రమాణస్వీకారం చేశారు. నేడు బలపరీక్షలో నెగ్గారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని