Suneetha Narreddy: జగనన్నా.. అంతఃకరణశుద్ధి అంటే అర్థం తెలుసా?: సునీత

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో నిందితులకు శిక్షపడాలని పోరాడుతున్న తనపై నింద మోపుతారా అని ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి (Suneetha Narreddy) ప్రశ్నించారు.

Updated : 15 Mar 2024 18:49 IST

కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో నిందితులకు శిక్షపడాలని పోరాడుతున్న తనపై నింద మోపుతారా అని ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి (Suneetha Narreddy) ప్రశ్నించారు. హత్యతో తన కుటుంబానికి సంబంధముంటే ఎందుకు అరెస్ట్‌ చేయలేదని నిలదీశారు. వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. వివేకానందరెడ్డి జీవితాంతం వైఎస్‌ఆర్‌ కోసమే పనిచేశారని చెప్పారు. ఉమ్మడి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. ఫ్యాక్షన్‌, హింసను తగ్గించాలని నిత్యం ఆలోచించేవారని చెప్పారు. 

మమ్మల్ని పట్టించి ఆ బహుమతి అందుకోండి

‘‘వివేకానందరెడ్డి మనకి దూరమై ఐదేళ్లయింది. ఆయనకు అంత కీడు ఎలా తలపెట్టారని ఆలోచిస్తున్నప్పుడే జగనన్న సీఎం అయ్యారు. ప్రజలందరికీ న్యాయం చేస్తానని ఆయన ప్రమాణస్వీకారం చేశారు. అది చూసి మనమంతా గర్వపడ్డాం. జగనన్నను ఒక ప్రశ్న అడుగుతున్నా.. అంతఃకరణశుద్ధిగా అంటే అర్థం తెలుసా? వివేకాను చంపిన వారికి, చంపించిన వారికి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇప్పటివరకూ హంతకులకు శిక్షపడేలా ఎందుకు చేయలేదు? మీ ప్రమాణాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదు.? మేం ఈ నేరం చేశామని చెప్పడం మీకు ఎబ్బెట్టుగా లేదా? ప్రభుత్వంలో ఉండి.. మాపై ఆరోపణలు చేయడమేంటి? హంతకులను పట్టిస్తే రూ.5 లక్షలు ఇస్తామని సీబీఐ ప్రకటించింది. జగనన్నా.. మమ్మల్ని పట్టించి ఆ బహుమతి అందుకోండి. 

మీ వద్ద ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండి

పదేపదే మాపై ఆరోపణలు చేయడానికి మీకు సిగ్గుగా లేదా? సాక్షి పత్రికలో మాపై నిందలు వేస్తూ వార్తలు రాస్తున్నారు. సాక్షి ఛైర్‌పర్సన్‌ భారతికి ఓ విన్నపం.. మీ వద్ద ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండి. ఆధారాలు ఉండీ పోలీసులకు ఇవ్వకపోవడం నేరం. అన్నం పెట్టిన చేతిని నరకడం.. వ్యక్తిత్వం మీద బురద జల్లడం దారుణం. మాపై నిందలు వేసినా.. సీతాదేవిలా నిర్దోషిత్వం నిరూపించుకుంటాం. మీ కోసం నిరంతరం పని చేసిన వివేకాను మర్చిపోయారా? తండ్రిపోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు ఉన్నారు.. చంపినవాళ్లు, చంపించినవాళ్లు, వాళ్లను కాపాడుతున్న వాళ్లు మరోవైపు ఉన్నారు. ప్రజలారా.. మీరు ఎటువైపు ఉంటారు? దిగ్భ్రాంతిలో ఉండిపోతారా? మీకు స్పందించే అవకాశం వచ్చింది.. స్పందించండి. వైకాపా పునాదులు వివేకా, కోడికత్తి శ్రీను రక్తంలో మునిగి ఉన్నాయి. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీ భవిష్యత్‌ కోసం బయటకు రండి. రాకపోతే ఆ పాపం మీకు చుట్టుకుంటుంది’’ అని సునీత వ్యాఖ్యానించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు