Chandrababu: రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: చంద్రబాబు

ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టబెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మీడియా సహా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు.

Updated : 05 Jun 2024 12:34 IST

అమరావతి: ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టబెట్టినందుకు  రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మీడియా సహా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ ఐదేళ్ల తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఐదేళ్లలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని చెప్పారు. సహజ సంపద విచ్చలవిడిగా దోచుకున్నారన్నారు. తాము మిగులు విద్యుత్‌ తీసుకొస్తే వైకాపా నాశనం చేసింది. 9 సార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచేసి ప్రజలపై భారం మోపారని వివరించారు.

ఇలాంటి చరిత్రాత్మక ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

‘‘వైకాపా పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశాం. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయం. భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లాం. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలు శాశ్వతం. పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపనతో వచ్చి పనిచేశారు. పక్క రాష్ట్రాల్లో కూలీ పనులకు వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేశారు. తెదేపా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు ఇవి. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినపుడు 1983లో 200 సీట్లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. 45.60 శాతం తెదేపాకు, 39.37 శాతం వైకాపాకు వచ్చాయి. అవినీతి, అరాచకాలతో పనిచేసినందునే ఆ పార్టీకి ఇలాంటి గతి పట్టింది.

మా కార్యకర్తలను హింసించారు

ఈ ఐదేళ్లూ మా కార్యకర్తలు చాలా మంది ఇబ్బంది పడ్డారు. వారు కంటినిండా నిద్రపోలేదు. ప్రాణాలతో ఉండాలంటే జై జగన్‌ అనాలని హింసించారు. జై తెలుగుదేశం.. జై చంద్రబాబు అంటూ ప్రాణాలు వదిలిన పరిస్థితిని చూశాం. కార్యకర్తల త్యాగాల ఫలితమే ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. మీడియా కూడా ఐదేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రజాస్వామ్యమే సిగ్గుతో తల దించుకునే ఘటనలు జరిగాయి. ఎవరినైనా.. ఏదైనా చేయొచ్చని దాడులు చేశారు. విశాఖపట్నం వెళ్తే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను వెనక్కి పంపించేశారు. కేసులు ఎందుకు పెట్టారని ఎవరైనా అడిగితే అరెస్ట్‌ చేశారు.

మేం పాలకులం కాదు.. సేవకులమని పనిచేస్తాం. మా ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీళ్లేదని పవన్‌ పట్టుబట్టారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన కృషి చేశారు. పవన్‌తో పాటు కూటమిలో భాజపా భాగస్వామ్యమైంది. ఎలాంటి పొరపాటు లేకుండా మేమంతా కలిసి పనిచేశాం. ఎన్డీయేలో భాగస్వాములుగా బాధ్యతతో ముందుకెళ్లాం. సమష్టి కృషితోనే అనూహ్య విజయం సాధించగలిగాం’’ అని చంద్రబాబు చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని