Double Bedroom: తియ్యటి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న సీఎం కేసీఆర్‌: ఎమ్మెల్యే రఘునందన్‌

తెలంగాణలోని పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నేతలు ధర్నాలు చేపట్టారు. పలు జిల్లాల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌లు నిర్మించినప్పటికీ అర్హులకు ఎందుకు కేటాయించడం లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Updated : 24 Jul 2023 16:25 IST

కామారెడ్డి: తియ్యటి మాటలతో మభ్యపెడుతున్న పెడుతూ రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద భాజపా ఆధ్వర్యంలో పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ధర్నాలో రఘునందన్ పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 30లోగా నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని కేటాయించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి నిరుపేదలని పంపిస్తామని హెచ్చరించారు.

ఎన్నికలకు ముందు ఏవేవో మాటలు చెబుతూ రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం మాత్రమే కేసీఆర్‌ కొత్త పథకాలని ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. కులవృత్తుల వారికి ఇచ్చే రూ.లక్ష ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేస్తే.. లబ్ధిదారులు గులాబీ పార్టీకి చెందిన వారే ఉంటారని ఆరోపించారు. కామారెడ్డిలో డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు నిర్మించి నాలుగేళ్లు గడిచినా ఏ ఒక్క పేద కుటుంబానికి ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.

వాడవాడలో బెల్ట్‌షాపులు: ఈటల

తెలంగాణలో వాడవాడలో బెల్ట్‌షాపులు దర్శనమిస్తున్నాయని హుజూరాబాద్‌ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. అర్హులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇవ్వాలని వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌ సెంటర్‌లో భాజపా నేతలు ధర్నా చేపట్టారు. భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ధర్నాలో పాల్గొని మాట్లాడారు. భాజపా అధికారంలోకి రాగానే అర్హులు అందరికీ ఇళ్లు కేటాయిస్తామన్నారు. 57 ఏళ్లకే పింఛన్‌ అమలు చేస్తామని.. కుటుంబంలో అర్హులైన వారందరికీ పింఛన్‌ ఇవ్వనున్నట్లు ఈటల చెప్పారు.

ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్‌ను మించిన నాయకుడు లేరు: జీవన్‌రెడ్డి

కేసీఆర్‌కు ఓట్లు అడిగే అర్హత లేదు: డీకే అరుణ

ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం కేసీఆర్‌కు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలంటూ.. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాలలో ఆమె రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు