LS Polls: ‘యోగి’పై అయిష్టంగానే పోటీ చేశా.. అమితాబ్‌ బచ్చన్‌ కారణం : భాజపా ఎంపీ

2009 లోక్‌సభ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌పై అయిష్టంగానే పోటీ చేసినట్లు భాజపా ఎంపీ మనోజ్‌ తివారీ వెల్లడించారు.

Published : 04 Apr 2024 19:35 IST

దిల్లీ: ఈశాన్య దిల్లీ నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించిన భాజపా ఎంపీ, ప్రముఖ భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారీ (Manoj Tiwari).. మూడోసారి అదే స్థానం నుంచి బరిలో దిగారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఆయన సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)పై పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. తాను అయిష్టంగానే యోగిపై పోటీ చేసినట్లు ఆయన తాజాగా ఓ వార్తాసంస్థకు వెల్లడించారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) తన నిర్ణయం వెనక కారణమని చెప్పారు.

‘‘2009 ఎన్నికలకు ముందు నేను రాజకీయాల్లో లేను. ఆ సమయంలో అమితాబ్‌బచ్చన్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. ఆ క్రమంలోనే అప్పటి ఎస్పీ నేత అమర్‌సింగ్‌ను కలిశా. అమితాబ్‌, అమర్‌సింగ్‌, అనిల్ అంబానీలు హాజరైన ఓ సమావేశంలోనే ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకున్నా. అప్పుడు నేను కేవలం ఓ కళాకారుడినే. సమాజంలో ఎంతో పేరున్న ఆ ముగ్గురూ నన్ను ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా ప్రోత్సహించారు. కాబట్టి కాదనలేకపోయా. ఇష్టం లేకపోయినా ఎన్నికల బరిలోకి దిగాను. అప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి’’ అని నాటి పరిణామాలను మనోజ్‌ తివారీ గుర్తుచేసుకున్నారు.

లోక్‌సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!

యోగి ఆదిత్యనాథ్‌ను విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తిగా పరిగణిస్తానని, ఇప్పటివరకు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదని మనోజ్‌ తెలిపారు. ప్రస్తుతం యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆదిత్యనాథ్‌.. 2009 ఎన్నికల్లో గోరఖ్‌పుర్ నుంచి రెండు లక్షలకుపైగా మెజారిటీతో గెలుపొందారు. బీఎస్పీ అభ్యర్థి తర్వాత తివారీ మూడో స్థానంలో నిలిచారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు భాజపాలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో దిల్లీలో భాజపా తరఫున సీటు దక్కించుకున్న ఏకైక సిట్టింగ్ ఎంపీ ఆయనే కావడం విశేషం. దేశ రాజధానిలోని ఏడు పార్లమెంటు స్థానాలనూ కమలం కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని