Uttam Kumar Reddy: కేసీఆర్‌ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమే: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భారాస ప్రభుత్వ హయాంలో నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

Updated : 01 Apr 2024 15:42 IST

హైదరాబాద్‌: భారాస ప్రభుత్వ హయాంలో నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. జిల్లాల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్‌ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేనని చెప్పారు. భారాస ప్రభుత్వం రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదన్నారు. దేశంలోనే పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. విద్యుత్‌ విషయంలో ఆ పార్టీ ఏదో గొప్పలు సాధించామని చెప్పడం అబద్ధమన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు. పార్టీ, ప్రభుత్వంలో తనకు పరిమిత అధికారమే ఉందన్నారు. 

‘‘కేసీఆర్‌ ఆదివారం పచ్చి అబద్ధాలు మాట్లాడారు. డిప్రెషన్‌, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. పార్టీ మిగలదు అనే భయం ఆయనలో మొదలైంది. జాతీయ పార్టీ అన్నారు.. ఇంత త్వరగా ఏ పార్టీ కుప్పకూలలేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత భారాస మిగలదు. కేసీఆర్‌ కుటుంబసభ్యులు తప్ప అందులో ఎవరూ ఉండరు.

భారాస అధికారంలోకి వచ్చాక పంట బీమాను రద్దు చేశారు. కేసీఆర్‌ హయాంలో నష్టం జరిగితే రైతులకు బీమా పరిహారం ఇవ్వలేదు. నీటిపారుదల రంగం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు ఉందా? కమీషన్ల కోసం ప్లాన్‌, డిజైన్లు లేకుండా ప్రాజెక్టులు నిర్మించారు. కాళేశ్వరంపై మాట్లాడేందుకు ఆయన సిగ్గుపడాలి. భారాస ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు.. వారి హయాంలోనే కూలిపోయింది. ఒక్క పిల్లరే కుంగిందని.. అమెరికాలో బ్యారేజీ కుంగలేదా? అని కేసీఆర్‌ ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం కోసం విద్యుత్‌ ఖర్చే ఏడాదికి రూ.10వేల కోట్లు అవుతోంది. ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు ఆయనే అంగీకరించారు. మాజీ సీఎం అబద్ధాలు చెప్పడాన్ని ప్రజలు గమనించాలి. ఎన్టీపీసీకి సహకరించి ఉంటే 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉచితంగా వచ్చేది. 24 గంటల విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఖర్చు గురించి ఆలోచించడం లేదు. ఒక్కో ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం’’ అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని