Vasantha Krishna Prasad: తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెదేపాలో చేరారు.

Updated : 02 Mar 2024 13:20 IST

హైదరాబాద్‌: వైకాపాకు మరో షాక్‌ తగిలింది. మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెదేపాలో చేరారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్‌ వెళ్లారు. అక్కడే ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్‌కు కండువా కప్పిన చంద్రబాబు.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీపీ, ఇద్దరు వైస్‌ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, ఏడుగురు సొసైటీ అధ్యక్షులు, ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు, నలుగురు కౌన్సిలర్లు పార్టీలో చేరారు.

తెదేపాలో చేరిన అనంతరం వసంత కృష్ణప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘సంక్షేమం.. అభివృద్ధి.. ఈ రెండింటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ సత్తా చంద్రబాబుకే ఉంది. ఏపీ ప్రగతి మార్గంలో ముందుకు వెళ్లాలి.. పరిశ్రమలు రావాలి.. యువతకు ఉద్యోగాలు రావాలి.. ఇవన్నీ తెదేపా అధినేత వల్లే సాధ్యం అవుతుంది. అందుకే పార్టీలో చేరాను. మైలవరం నియోజకవర్గంలో గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో వైకాపా ఎమ్మెల్యేగా పార్టీ నిర్మాణం, అభివృద్ధికి ఎంతో కృషి చేశా. కానీ పార్టీలో ప్రాధాన్యత లభించలేదు. నేను ఎమ్మెల్యే అయ్యాక.. నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని సీఎంకు వినతులు ఇచ్చా. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెదేపాలో చేరానని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లాను. తప్పకుండా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రరాష్ట్ర పునర్‌నిర్మాణం కోసం కృషి చేస్తా’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని