గర్భిణిగా ఉన్న నా చెల్లి కడుపుపై తన్నారు: వైకాపా మూక దాడిలో గాయపడిన నూకరత్నం

ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పడంతో తమ కుటుంబంపై దాడి చేశారని వైకాపా కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు తెలిపారు.

Updated : 17 May 2024 13:24 IST

విశాఖపట్నం: ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పడంతో తమ కుటుంబంపై దాడి చేశారని వైకాపా కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు తెలిపారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ 49వ వార్డు పరిధిలోని బర్మా క్యాంప్‌ వద్ద సుంకర ధనలక్ష్మి, ఆమె కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠపై స్థానిక వైకాపా నేత అనుచరులు దాడి చేశారు. లోకేశ్‌, భాస్కర్‌, భూలోక్‌, సాయి సహా పలువురు తాగిన మత్తులో వచ్చి ఆ కుటుంబంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తర కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుతో కలిసి బాధితులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 

బొగ్గు శ్రీను వల్లే గొడవలు: నూకరత్నం

‘‘బొగ్గు శ్రీను అనే వ్యక్తి వల్ల గొడవలు జరుగుతున్నాయి. వెంటనే అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. మా ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారు.. తిరిగి మమ్మల్నే తిట్టారు. కొందరు వచ్చి నా తల, కాళ్లపై కొట్టారు. 24 కుట్లు పడ్డాయి. మా తమ్ముడిని ‘రంగస్థలం’ సినిమాలో హీరో అన్నయ్యను తీసుకెళ్లిన తరహాలో నలుగురు తీసుకెళ్లి దాడి చేశారు. నా చెల్లి గర్భిణి.. ఆమె కడుపుపై రెండుసార్లు తన్నారు. వాళ్లు అసలు మనుషులేనా? ఓటు ఎవరికి వేయాలనేది మా ఇష్టం. రాత్రి 10 గంటలకు పోలీసులు వచ్చి కొందరు వ్యక్తులను తీసుకెళ్లారు. ఈ ఘటనలో కొందరు నిందితులను వదిలేసినట్లు తెలుస్తోంది. దాడి చేసిన సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను పోలీసులకు ఇస్తాం. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు నుంచి గొడవలు జరుగుతున్నాయి. బర్మా క్యాంప్‌నకు ప్రచారానికి ఇతరులు ఎవరూ రాకుండా చూశారు’’ అని నూకరత్నం తెలిపారు. 

తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి

వైకాపాకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు: విష్ణుకుమార్‌రాజు

వైకాపా గూండాలకు పోలీసులు మద్దతిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలి. కుటుంబ తగాదాల వల్లే దాడులు జరిగాయనేది పచ్చి అబద్ధం. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత దాడి. విశాఖలో రౌడీయిజం, గూండాయిజం బాగా పెరిగింది. వైకాపాకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు. నాలుగో పట్టణ సీఐపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు