icon icon icon
icon icon icon

తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి

తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి.

Updated : 17 May 2024 08:10 IST

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలు
కర్రలు, రాడ్లతో విరుచుకుపడి.. గర్భిణీ కడుపుపై తన్నిన నిందితులు

ఈనాడు, విశాఖపట్నం; విశాఖపట్నం (మాధవధార), న్యూస్‌టుడే: తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. ఘటన గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని ఉత్తర నియోజకవర్గ పరిధి జీవీఎంసీ 49వ వార్డు బర్మా క్యాంప్‌ వద్ద సుంకర ధనలక్ష్మి తన కుమార్తెలు నూకరత్నం, రమ్య, కుమారుడు మణికంఠతో కలిసి చంద్రబాబు హయాంలో వచ్చిన ఇంట్లో ఉంటున్నారు. ఎన్నికల ముందు రోజు వైకాపా నాయకులు వీరింటికి వచ్చి ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని అడిగారు. ధనలక్ష్మి నిరాకరించారు. పక్కింటి వారితో తమకు జరిగిన ఓ గొడవలో వైకాపా నాయకులు ప్రత్యర్థులకే వత్తాసు పలికారని, అందుకే ఆ పార్టీకి ఓటేయబోమని, తెదేపాకే ఓటు వేస్తామని తేల్చిచెప్పారు. వైకాపా నేతలు ఇస్తామన్న డబ్బులనూ తిరస్కరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైకాపా నాయకులు.. ఎన్నికల తర్వాత మీ సంగతి చూస్తామంటూ వెళ్లారు. బెదిరించినట్లే.. పోలింగు రోజు రాత్రి కొంతమంది వచ్చి దుర్భాషలాడారు. బుధవారం రాత్రి వైకాపా నేత అనుచరులు లోకేశ్‌, భాస్కర్‌, భూలోక్‌, సాయి పలువురు తాగిన మత్తులో వచ్చి దాడికి దిగారు. ఆ సమయంలో ఇంట్లోంచి బయటికి వచ్చిన ధనలక్ష్మి, నూకరత్నం, మణికంఠలపై కర్రలు, రాడ్లతో విరుచుకుపడ్డారు. ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో ఉన్న 7 నెలల గర్భిణీ రమ్య కడుపుపై తన్నినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడ్డ వారిని స్థానికులు 108 అంబులెన్సులో కేజీహెచ్‌కు తరలించారు. బాధితులను తెదేపా నేతలు పరామర్శించారు. తెదేపాకు ఓటు వేశారన్న కారణంగానే దాడి జరిగిందని సామాజిక మాధ్యమాల్లో ఘటన వైరల్‌ కావడంతో పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేశారు. వ్యక్తిగత కక్షలతోనే గొడవ జరిగిందని, ఇందులో రాజకీయ ప్రమేయం లేదని జోన్‌-2 డీసీపీ ఎం.సత్తిబాబు తెలిపారు. ఐదుగురిపై కేసుపెట్టి, ప్రధాన నిందితుడు లోకేశ్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించామన్నారు.


ఇది ప్రజాస్వామ్యంపై దాడి : లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి : తెదేపాకు ఓటేశారని విశాఖలోని ఓ కుటుంబంపై వైకాపా వాళ్లు దాడి చేయడాన్ని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు. దీన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ‘‘ఓటమి భయంతో వైకాపా గూండాలు రెచ్చిపోతున్నారు. మహిళలు, యువకుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడటం అమానుషం’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img