Navneet Rana: మోదీ వేవ్ లేదట.. వివాదంలో భాజపా అభ్యర్థి నవనీత్‌ రాణా

భాజపా అభ్యర్థి నవనీత్ రాణా (Navneet Rana) ఎన్నికల ప్రచార వీడియో వైరల్ కావడంతో.. విపక్షాలు ఆ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు విసిరాయి. 

Published : 17 Apr 2024 16:23 IST

ముంబయి: ‘మోదీ వేవ్‌ లేదు’ అంటూ భాజపా అభ్యర్థి నవనీత్ రాణా (Navneet Rana) అన్నట్టుగా ఉన్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని తన సిటింగ్‌ నియోజకవర్గం అమరావతిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇదికాస్తా ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది.

‘‘పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ పోరాడాలి. మధ్యాహ్నం 12 కల్లా ఓటర్లందరినీ బూత్‌కు తీసుకురావాలి. మోదీ వేవ్‌ ఉందనే భ్రమలో ఉండకండి. 2019లో కూడా మోదీ వేవ్ ఉంది. కానీ నేను అప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాను’’ అని ఆమె అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌సీపీ మద్దతుతో అమరావతి నుంచి ఆమె విజయం సాధించారు. ఇదిలాఉంటే.. ఈ వీడియోపై ఎన్‌సీపీ(శరద్‌పవార్‌), శివసేన(యూబీటీ) విమర్శలు గుప్పించాయి. భాజపా క్యాడర్‌లో భయం నెలకొని ఉందన్నాయి. ‘‘మోదీ వేవ్‌ గురించి మర్చిపోండి. ఆయన తన సొంత స్థానాన్ని గెలుచుకోగలరా లేదా అన్నది కూడా ప్రశ్నే. భాజపా దేశవ్యాప్తంగా 45 స్థానాలు మాత్రమే గెలుస్తుందని ఇప్పటికే మన అధినేత(ఉద్ధవ్‌ ఠాక్రే) చెప్పారు. చివరకు ఆ పార్టీ నేతలు బహిరంగంగా నిజాలు చెప్తున్నారు’’ అని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేశారు.

‘రాహుల్‌, ప్రియాంక అమూల్‌ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు

అయితే ఈ వివాదంపై నవనీత్ వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు తన ప్రసంగాన్ని వక్రీకరించాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మోదీ నేతృత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ప్రజలకు తెలుసు. ఇప్పుడు, ఎప్పుడూ మోదీ వేవ్ ఉంటుంది. ఆయన చేసిన పని, ఇచ్చిన హామీలు చెప్పి ఓట్లు అడుగుతున్నాం. 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకుంటాం’’ అని వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని