Politics: కంగనా vs విక్రమాదిత్య.. వేడెక్కిన ‘మండి’ రాజకీయం!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ హిమాచల్‌లోని మండిలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ ప్రాంతం నుంచి బరిలో నిలిచిన భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌.. కాంగ్రెస్‌ నేత విక్రమాదిత్య సింగ్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Published : 23 May 2024 00:04 IST

శిమ్లా: యువనేతల ముమ్మర ప్రచారంతో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడినుంచి బరిలో నిలిచిన భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌ (Kangana Ranaut).. కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌ (Vikramaditya Singh)ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల కాజా ప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన కంగనాకు స్థానికుల నుంచి నిరసనలు ఎదురుకావడాన్ని విక్రమాదిత్య లక్ష్యంగా చేసుకున్నారు. ఆధ్యాత్మిక గురువు దలైలామాపై గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తుచేస్తూ.. కంగనాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘ఆధ్యాత్మిక గురువు దలైలామాను లాహౌల్‌, కాజాలో ఉండే ఆదివాసీలు భగవంతుడిగా ఆరాధిస్తారు. ఆయనకు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించరు. అందుకే నిరసన తెలుపుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే కాంగ్రెస్‌పై భాజపా తప్పుడు ప్రచారం చేస్తోంది’’ అని విక్రమాదిత్య సింగ్‌ పేర్కొన్నారు. నిరసనలకు తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు.

ఓట్ల కోసం తమిళుల్ని కించపరుస్తారా?

ఇది కచ్చితంగా కాంగ్రెస్‌ నేతల పనేనని.. ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని కంగనా రనౌత్‌ ఆరోపించారు. తమ కాన్వాయ్‌పై రాళ్లు రువ్వడంతో కార్యకర్త ఒకరు తీవ్రంగా గాయపడ్డారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘‘కాంగ్రెస్‌ గూండాయిజానికి ఈ ఘటన అద్దం పడుతోంది. ఇది నిజంగా బాధాకరం. వారి నిజస్వరూపాలను ప్రజలు చూశారు’’ అని ఆమె ఆరోపించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో దలైలామా కలిసి ఉన్న ఫొటోను కంగనా సోషల్‌ మీడియాలో గతంలో షేర్‌ చేశారు. ఇందులో దలైలామా ఫొటో కాస్త అభ్యంతరకరంగా ఎడిట్‌ చేసి ఉండడంతో వివాదాస్పదానికి కారణమైంది. దీంతో ముంబయిలోని ఆమె కార్యాలయం ఎదుట కొందరు నిరసనకు దిగారు. ఆ తర్వాత ఆమె క్షమాపణలు కోరారు. ఇటీవల మండిలో ప్రచారానికి వెళ్లిన కంగనాకు ఇదే విషయంపై స్థానికుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. నల్లజెండాలు చూపుతూ.. ‘గో బ్యాక్‌ కంగనా’ అంటూ నినాదాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని