Chennai: మోటార్‌ సైకిల్‌ రేసింగ్‌లో విషాదం.. ప్రమాదానికి గురై 13 ఏళ్ల రేసర్‌ మృతి

చెన్నైలో శనివారం జరిగిన మోటార్‌ సైకిల్‌ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన 13 ఏళ్ల శ్రేయాస్‌ అనే యువరైడర్‌ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. 

Updated : 06 Aug 2023 07:01 IST

చెన్నై: చెన్నైలో శనివారం జరిగిన జాతీయ మోటార్‌ సైకిల్‌ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన 13 ఏళ్ల కొప్పరం శ్రేయస్‌ హరీష్‌ అనే యువ రేసర్‌ సర్క్యూట్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రగాయాలపాలై మృతి చెందాడు. దీంతో మద్రాస్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరుగున్న ఈ పోటీలను శని, ఆదివారాలు నిలిపివేస్తున్నట్లు ఈవెంట్‌ ప్రమోటర్‌ తెలిపారు. బెంగళూరుకు చెందిన శ్రేయస్‌కు బైక్‌ రేసింగ్‌లు అంటే విపరీతమైన ఇష్టం. దీంతో రేసింగ్‌లోకి అడుగుపెట్టిన శ్రేయస్‌ అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో పలు రేసింగ్‌ పోటీల్లో విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో పెట్రోనాస్‌ టీవీఎస్‌ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు రేసుల్లో గెలిచి రైజింగ్‌ స్టార్‌గా ఎదిగాడు. 

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా!?

మద్రాస్‌ అంతర్జాతీయ సర్య్కూట్‌లో ‘ జాతీయ మోటార్‌ సైకిల్‌ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌’ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా శనివారం ఉదయం పోల్‌ పొజిషన్‌కు అర్హత సాధించిన హరీశ్‌ రూకీ రేసులో పాల్గొన్నాడు. ఈ క్రమంలో మూడో రౌండ్‌లో అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. నిర్వాహకులు వెంటనే రేస్‌ను ఆపేసి శ్రేయస్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో పలువురు శ్రేయస్‌ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ ప్రతిభావంతుడైన ఒక యువ రైడర్‌ను కోల్పోయాం. గత కొంత కాలంగా అత్యద్భుత రేసింగ్‌ ప్రతిభతో శ్రేయస్‌ రాణిస్తున్నాడు’’ అని ఎంఎంఎస్సీ ప్రెసిడెంట్‌ అజిత్‌ థామస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

‘‘ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారంలో జరగాల్సిన మిగిలిన రేసింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించాం. శ్రేయస్‌ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాము. ఈ దుఃఖ సమయంలో అతడి కుటుంబం చుట్టూనే మా ఆలోచనలు తిరుగుతున్నాయి’’ అని ఈరేసింగ్‌లో పాలుపంచుకున్న ఎంఎంఎస్సీ తెలిపింది. ఈ ఏడాది మేలో జరిగిన మినీజీపీ ఇండియా టైటిల్‌ పోరులో శ్రేయాస్‌ విజయం సాధించాడు. అంతేకాకుండా స్పెయిన్‌లో జరిగిన మినీజీపీ పోటీల్లో పాల్గొని వరుసగా 5, 4 స్థానాల్లో నిలిచాడు. ‘సీఆర్‌ఏ మోటార్‌స్పోర్ట్స్‌’ తరపున 250 సీసీ కేటగిరీలో ఈ నెలలో మలేసియాలో జరగనున్న ఎంఎస్‌బీకే ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు శ్రేయస్‌ సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇలాంటి సంఘటనే ఈ ఏడాదిలో మరోటి చోటుచేసుకొని ప్రముఖ రేసర్‌ చనిపోయాడు. మద్రాస్‌లోని ఇంటర్నేషనల్‌ సర్య్కూట్‌లో జరిగిన ఎంఆర్‌ఎఫ్‌ ఎంఎంఎస్సీ ఎఫ్‌ఎంఎస్సీఐ ఇండియన్‌ కార్‌ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 2022లో 59 ఏళ్ల కేసీ కుమార్‌ ప్రమదానికి గురై ఈ ఏడాది జనవరిలో చనిపోయాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని