Ranji Trophy: టీమ్‌ఇండియాలో నో ఛాన్స్‌.. ఒకే ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్‌

చాలా కాలంగా టీమ్‌ఇండియాకు దూరంగా ఉన్న భువనేశ్వర్‌ కుమార్‌ (Bhuvneshwar Kumar) రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. 

Updated : 13 Jan 2024 18:37 IST

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు టీమ్‌ఇండియాలో భువనేశ్వర్‌ కుమార్‌ ప్రధాన బౌలర్‌గా కొనసాగాడు. ఈ 33 ఏళ్ల ఫాస్ట్‌బౌలర్‌ కొన్నాళ్లుగా ఫామ్‌ కోల్పోయి భారత జట్టులో చోటు కోల్పోయాడు. అతడు చివరి టెస్టు ఆడి ఐదేళ్లు దాటింది. 2022 జనవరిలో ఆఖరి వన్డే, అదే ఏడాది నవంబర్‌లో టీ20 ఆడాడు. తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలనే కసితో ఉన్న భువీ ఆరేళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీలో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భువనేశ్వర్‌ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. 22 ఓవర్లు బౌలింగ్ చేసి 41 పరుగులిచ్చి ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు మెయిడిన్‌లు ఉండటం విశేషం. 

ఎలైట్ గ్రూప్‌ బిలో బెంగాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు (శనివారం) ఐదు వికెట్లు తీసిన భువీ.. రెండో రోజు మరో ముగ్గురిని ఔట్ చేసి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. దీంతో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ షమి సోదరుడు మహ్మద్‌ కైఫ్‌ (45) రాణించాడు. మొదటి రోజు ఆటలో మహ్మద్‌ కైఫ్‌ (4/14), సూరజ్‌ సింధు జైస్వాల్ (3/20), ఇషాన్‌ పొరెల్ (2/24) బంతితో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఉత్తర్‌ప్రదేశ్ 60 రన్స్‌కే కుప్పకూలింది. 

భువీకి దక్కని చోటు..

భారత్, ఇంగ్లాండ్ మధ్య జనవరి 25 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల కోసం శుక్రవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అందులో భువనేశ్వర్‌కు చోటు దక్కలేదు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా భువీ రెండో రోజు (శనివారం) కూడా అద్భుతమైన బౌలింగ్‌ కొనసాగించాడు. రంజీ ట్రోఫీలో అతడు మున్మందు కూడా ఇదే విధంగా రాణిస్తే ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు ఎంపికయ్యే అవకాశముంది. 


దుమ్మురేపుతున్న  ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’.. దర్శకుడి కుమారుడు

బాలీవుడ్‌ దర్శకుడు విధూ వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra) కుమారుడు అగ్ని చోప్రా (Agni Chopra) రంజీ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. అరంగేట్రంలోనే భారీ శతకం బాదిన అతడు సూపర్‌ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. మిజోరం తరఫున ఆడుతున్న ఈ 25 కుర్రాడు సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో (166; 179 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లు) సంచలన ఆటతీరుతో శతకం బాదాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ (92; 74 బంతుల్లో) రాణించాడు. కానీ, ఆ మ్యాచ్‌లో మిజోరం నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. 

ప్రస్తుతం నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అగ్ని చోప్రా అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో (164; 150 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి భారీ శతకం సాధించాడు. దీంతో మిజోరం 356 పరుగులకు ఆలౌటైంది. ఇటీవల విడుదలైన ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ చిత్రం విశేష ఆదరణ సొంతం చేసుకుంది. విక్రాంత్‌ మస్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను విధూ వినోద్ చోప్రా తెరకెక్కించాడు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని