Virat Kohli: విరాట్ కోహ్లీ.. నువ్వు ఆ ఓవర్లలో క్రీజ్‌లోనే ఉండాలి: ఏబీ డివిలియర్స్‌

స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాణిస్తున్నా.. మిగతా వారినుంచి అంతగా సహకారం లభించడం లేదు. బౌలింగ్‌లోనూ తేలిపోతూ బెంగళూరు జట్టు ఓటములను చవిచూస్తోంది. 

Published : 04 Apr 2024 15:39 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో బెంగళూరు (Bengaluru) పరిస్థితి దారుణంగా ఉంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన గత మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. టాప్‌ ఆర్డర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli).. లోయర్‌ ఆర్డర్‌లో దినేశ్ కార్తిక్‌ రాణిస్తుండటంతో ప్రత్యర్థుల ముందు ఓ మాదిరి స్కోర్లను ఉంచగలుగుతోంది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రం దారుణమైన ప్రదర్శనతో నిరాశపరిచారు. టీ20ల్లో దూకుడుగా ఆడే మ్యాక్సీ మాత్రం తేలిపోవడం గమనార్హం. ఇక బౌలింగ్‌ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఈ క్రమంలో బెంగళూరు టైటిల్ రేసులో నిలవాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్‌ గెలిస్తేనే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇలా జరగాలంటే స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ మిడిల్‌ ఓవర్లలో క్రీజ్‌లో ఉండాలని.. ఒకప్పటి సహచరుడు ఏబీ డివిలియర్స్‌ వ్యాఖ్యానించాడు. దీనివల్ల జట్టు సమతూకంగా ఉంటుందని పేర్కొన్నాడు. 

‘‘విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ప్రారంభాన్ని టోర్నీ ఆసాంతం కొనసాగస్తాడని ఆశిస్తున్నా. బెంగళూరు మిడిల్‌ ఓవర్లలో పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. తొలి ఆరు ఓవర్లలో విరాట్‌ ఆటను చూస్తున్నాం. ఫాఫ్‌ డుప్లెసిస్‌ కూడా రిస్క్‌ తీసుకోవాలి. కానీ, కోహ్లీని 6 నుంచి 15 ఓవర్ల మధ్య క్రీజ్‌లో ఉండటం చూడాలని ఉంది. అప్పుడే బెంగళూరు జట్టులోని అందరూ మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు బెంగళూరు ప్రయాణం మరీ దారుణంగా ఏమీ లేదు. టోర్నీలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. వచ్చే మ్యాచుల్లో విజయం సాధిస్తే ముందుకురావచ్చు. మళ్లీ సొంత మైదానంలో ఆడేలోగా పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండేందుకు ప్రయత్నించాలి’’ అని ఏబీడీ తెలిపాడు. 

షాన్‌ టైట్‌ మాదిరి పేసర్‌ మయాంక్‌: గ్లెన్‌ మ్యాక్స్‌వెల్

ఐపీఎల్‌లో అందర్నీ ఆకట్టుకున్న పేసర్ మయాంక్‌ యాదవ్. గంటకు 150 కి.మీ. వేగంతో నిలకడగా బంతులను సంధిస్తున్న అతడు.. ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ బాల్‌ను వేశాడు. ఈక్రమంలో మయాంక్‌ను తమ మాజీ క్రికెటర్ షాన్‌ టైట్‌తో పోలుస్తూ మ్యాక్స్‌వెల్ ప్రశంసించాడు. ‘‘పంజాబ్‌పై అద్భుతంగా బంతులేసిన తర్వాత.. అతడి బౌలింగ్‌పై నేనూ వర్కౌట్‌ చేశా. అయితే, అవేవీ సత్ఫలితాలను ఇవ్వలేదు. ఎందుకంటే ఇలాంటి బౌలర్‌ను నేరుగా ఎదుర్కొంటేనే అనుభవం వస్తుంది. నాకు కొద్ది ఎత్తులో బౌన్సర్‌ను సంధించాడు. అదే నేను ఎదుర్కొన్న తొలి బంతి. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో వచ్చింది. ఆ తర్వాత బంతికే నేను ఔటయ్యా. ఇతర బౌలర్లతో పోలిస్తే కాస్త అదనంగా పేస్‌ను రాబట్టాడు. మా జట్టులో షాన్ టైట్‌ కూడా ఇలాంటి ఫాస్ట్‌తో బౌలింగ్‌ చేసేవాడు’’ అని మ్యాక్సీ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని