Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌ మీద గురుతర బాధ్యత ఉంది: ఏబీ డివిలియర్స్‌

Eenadu icon
By Sports News Team Published : 31 May 2025 14:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్ఇండియా (Team India) జూన్‌ 20 నుంచి ఇంగ్లండ్‌తో అయిదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ (ICC World Test Championship) నూతన సిరీస్‌ ఈ టూర్‌తోనే ప్రారంభం కానుంది. రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్‌ కోహ్లీ (Virat Kohli) సుదీర్ఘ ఫార్మాట్‌కు తమ రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇంగ్లండ్‌ గడ్డ మీద భారత యువజట్టు ఏమేరకు రాణించగలుగుతుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అనుభవజ్ఞుడైన రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) గత సంవత్సరమే ఆస్ట్రేలియా టూర్‌ సందర్భంగా తన రిటైర్మెంట్‌ ప్రకటించడం, సీనియర్‌ పేసరైన మహ్మద్‌ షమీ (Mohammed Shami) తన ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల ఇంగ్లండ్‌ టూర్‌కు ఎంపిక కాకపోవడం కూడా టీమ్‌ఇండియాకు ప్రతికూలాంశాలే!

ఇలా సీనియర్ల సేవలను కోల్పోయిన టీమ్‌ఇండియా నూతన టెస్ట్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) నియమితుడయ్యాడు. ఇది 25 ఏళ్ల గిల్‌కు నిజంగా కఠిన పరీక్షే కానుంది. ఈవిషయమై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ (AB de Villiers).. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడాడు. ‘టీమ్‌ఇండియాకు నవశకం ప్రారంభం కావడానికి ఇదే సరైన సమయం. యువకులు తామేంటో నిరూపించుకోవాలి. నూతన టెస్ట్‌ కెప్టెన్‌గా టీమ్‌ఇండియాను ముందుకునడిపించాల్సిన గురుతర బాధ్యత శుభ్‌మన్‌ గిల్‌ మీద ఉంది. భారతదేశంలో టాలెంట్‌కు కొదవలేదు. ఈ విషయంలో క్రెడిట్‌ అంతా ఐపీఎల్‌కే దక్కుతుంది. ప్రతిభ ఉన్న ఎంతోమంది యువ ఆటగాళ్లను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఈ సీజన్‌లో వైభవ్‌ సూర్యవంశీ లాంటి కుర్రాళ్లు తమ ఆటతీరులో ఎంతో పరిణతి ప్రదర్శించారు’ అని డివిలియర్స్‌ అన్నారు.

అలాగే టీమ్‌ఇండియాకు ఇంగ్లండ్‌లో ఎదురుకానున్న సవాళ్ల గురించి కూడా అతడు మాట్లాడాడు. ‘ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ టీమ్‌ఇండియా ఆటగాళ్లలో ప్రతిభకు కొదవలేదు. వారు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు’ అని వివరించాడు. అలాగే ఒకప్పటి తన రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు సహచరుడైన విరాట్‌ కోహ్లీ.. టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం మీద కూడా ఏబీ డివిలియర్స్‌ స్పందించాడు. ‘కోహ్లీ తాను అనుకున్నదే చేశాడు. అతడు కొన్ని సంవత్సరాలుగా ప్రపంచం నలుమూలలా ఎంతో క్రికెట్‌ ఆడాడు. అదృష్టవశాత్తూ అతన్ని మనం ఇంకా మైదానంలోనే చూస్తున్నాం. టెస్ట్‌ క్రికెట్‌లో మనం కోహ్లీని మాత్రం మిస్‌ కానున్నాం. అతడు రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు’ అని ఏబీ డివిలియర్స్‌ కోహ్లీని కొనియాడాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు