Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌.. దేశవాళీ క్రికెట్‌కూ అందుబాటులో లేడా?

టీమ్‌ఇండియా క్రికెటర్ ఇషాన్‌ కిషన్ (Ishan Kishan) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటు టీమ్‌ఇండియాకు ఎంపిక కాకపోవడం.. అటు రంజీల్లో ఆడకపోవడం అతడికి కష్టాలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.  

Updated : 12 Jan 2024 13:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్న భారత యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్ (Ishan Kishan) అఫ్గాన్‌తో జరగనున్న సిరీస్‌కూ ఎంపిక కాలేదు. టీ20 సిరీస్‌ ఆడాలని భావించినా.. సెలక్టర్లు మాత్రం అతడిని పక్కన పెట్టారనే వార్తలు వచ్చాయి. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే ఇషాన్‌పై చర్యలు తీసుకున్నారన్న కథనాలను భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కొట్టిపడేశాడు. దేశవాళీ క్రికెట్‌ ఆడి రావాలని అతడికి సూచించాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు వికెట్‌ కీపర్‌గా కేఎస్ భరత్‌ కూడా రేసులో ఉన్నాడు. అయితే, రంజీల్లో ఆడేందుకూ ఇషాన్‌ ఆసక్తిగా లేనట్లు సమాచారం. అతడి ప్రాతినిధ్యంపై ఝార్ఖండ్‌ క్రికెట్ సంఘం ఇప్పటి వరకూ ధ్రువీకరించలేదు.

‘‘ఇషాన్‌ విషయంలో మాకు స్పష్టత లేదు. అతడు రంజీ ట్రోఫీ కోసం అందుబాటులో ఉంటానని చెప్పలేదు. ఎప్పుడు చెప్పినా సరే నేరుగా తుది జట్టులో ఆడిస్తాం’’ అని ఆ సంఘం కార్యదర్శి దేబశిశ్ చక్రవర్తి పేర్కొన్నారు. ‘మానసిక అలసట’ కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇషాన్‌ దుబాయ్ పార్టీలకు వెళ్లడంతోనే బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసిందనే కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు రంజీల్లో ఆడకపోతే ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేయడం కష్టమేనని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.

రంజీల్లో శ్రేయస్‌ అయ్యర్, అజింక్య

శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ క్రమశిక్షణా చర్యలే కారణమంటూ వచ్చిన వార్తలను ద్రవిడ్ ఖండించాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను కూడా అయ్యర్ ఆడలేదని గుర్తు చేశాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో తన ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి అతడు రంజీ బరిలోకి దిగాడు. ముంబయి తరఫున ఆంధ్రా జట్టుపై ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆడని అంజిక్య రహానె తన సత్తా చాటేందుకు వచ్చాడు. కెప్టెన్‌గా ముంబయి జట్టును నడిపిస్తున్నాడు. సౌరాష్ట్ర తరఫున తొలి మ్యాచ్‌లో ఝార్ఖండ్‌పై డబుల్‌ సెంచరీ సాధించిన పుజారా.. హరియాణాతోనూ బరిలోకి దిగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని