T20 World Cup: 4-2-4-2.. 43 ఏళ్ల వయసులో ఉగాండా బౌలర్‌ చరిత్ర

ఉగాండా బౌలర్ చరిత్ర సృష్టించాడు. పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో రికార్డు బౌలింగ్‌ వేశాడు.

Updated : 06 Jun 2024 11:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆ రెండు జట్లు దాదాపు సమవుజ్జీలే. రెండూ అనామక టీమ్‌లే. టీ20 వరల్డ్‌ కప్‌ (T20 World Cup 2024) టోర్నీకి అర్హత సాధించి బరిలో నిలిచాయి. అయితే, పొట్టి కప్‌ చరిత్రలోనే ఓ బౌలర్‌ అత్యంత తక్కువ ఎకానమీతో బంతులేసి రికార్డు సృష్టించాడు. అదీనూ 43 ఏళ్ల వయసులో అరుదైన ఘనతను సాధించాడు. తన జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గురువారం ప్రపంచ కప్‌లో భాగంగా ఉగాండా - పపువా న్యూగినియా (UNG vs PNG) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఉగాండా మూడు వికెట్ల తేడాతో పీఎన్‌జీని ఓడించింది. వరల్డ్‌ కప్‌ల్లో ఆ జట్టుకు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. 

టాస్‌ నెగ్గిన ఉగాండా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినియా 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌటైంది. ఉగాండా బౌలర్లలో అల్పేష్ 2, సుబుగా 2, కోస్మస్ 2, జుమా 2, మసాబా ఒక వికెట్ తీశారు. ఇక్కడ అసలు విశేషం ఏంటంటే.. ఉగాండా సీనియర్‌ బౌలర్‌ సుబుగా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 4 పరుగులను మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు (4-2-4-2) పడగొట్టాడు. టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో ఇదే అత్యంత ఉత్తమ ఎకానమీ (1.00) బౌలింగ్‌. ఇదే పొట్టి కప్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ బార్ట్‌మన్ (2.25) చేసిన అత్యుత్తమ ప్రదర్శనను సుబుగా అధిగమించాడు. సుబుగా నాలుగు ఓవర్లలో రెండు మెయిడిన్లుగా చేశాడు. పపువా న్యూగినియా నిర్దేశించిన 78 పరుగుల టార్గెట్‌ను ఉగాండా 7 వికెట్లను కోల్పోయి ఛేదించింది. రియాజత్ (33) టాప్‌ స్కోరర్‌ కాగా.. అతడితోపాటు జుమా (13) మాత్రమే డబుల్‌ డిజిట్ స్కోరు చేశాడు. పపువా న్యూగినియా బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో ఉగాండా కాస్త ఇబ్బంది పడింది. చివరికి 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది.

మరో మ్యాచ్‌లో ఆసీస్ విజయం

ఒమన్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఒమన్ 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆసీస్‌ 39 పరుగుల తేడాతో గెలిచింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు