OMG 2 Movie Review: రివ్యూ: ‘ఓ మైగాడ్2’.. అక్షయ్‌ శివుడిగా నటించిన మూవీ ఎలా ఉందంటే?

OMG 2 Movie Review: అక్షయ్‌ కుమార్‌ శివుడిగా కనిపించిన ‘ఓ మైగాడ్‌2’ ఎలా ఉందంటే?

Published : 12 Aug 2023 01:38 IST

OMG 2 Movie Review; చిత్రం: ఓ మైగాడ్2; నటీనటులు: అక్షయ్‌కుమార్‌, పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, పవన్‌ మల్హోత్ర, గోవింద నామ్‌దేవ్‌, బ్రిజేంద్ర కాలా తదితరులు; సంగీతం: విక్రమ్‌ మాంట్రోస్‌, హన్సరాజ్‌ తదితరులు; సినిమాటోగ్రఫీ: అమలేందు ఛౌదరి; ఎడిటింగ్‌: సువిర్‌ నాథ్‌; నిర్మాత: అరుణా భాటియా, విపుల్‌, రాజేశ్‌ భల్‌, అశ్విన్‌ వాద్రా; రచన, దర్శకత్వం: అమిత్‌ రాయ్‌; విడుదల: 11-08-2023

క్షయ్‌కుమార్‌ (Akshay Kumar) దేవుడి పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్‌’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘ఓ మై గాడ్‌ 2’ (OMG 2) రూపొందింది. అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ సారి ఏ అంశాన్ని చర్చించారు?

కథేంటంటే: కాంతి శరణ్‌ ముగ్దల్‌ (పంకజ్‌ త్రిపాఠి) ఆలయం పక్కనే పూజా స్టోర్‌ను నడుపుతుంటాడు. మహా శివ భక్తుడు. భార్య, కొడుకు వివేక్‌ (ఆరుష్‌ వర్మ)తో పాటు తన వద్దే ఉన్న తండ్రిని కూడా ముగ్దల్‌ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఒక రోజు వివేక్‌ అసభ్య ప్రవర్తన కారణంగా పాఠశాల నుంచి బహిష్కరణకు గురవుతాడు. అంతేకాదు, టాయ్‌లెట్‌లో అతడు చేసిన పనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. దీంతో పరువు పోయిందని భావించిన ముగ్దల్‌ కుటుంబాన్ని తీసుకుని ఆ ఊరు నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. అదే సమయంలో దేవదూత (అక్షయ్‌కుమార్‌) ప్రత్యక్షమవుతాడు. ముగ్దల్‌ కుమారుడు చేసిన పని భయపడి పారిపోకుండా దానిపై పోరాటం చేయాలని సూచిస్తాడు. మరి దేవదూత మాటలు విన్న ముగ్దల్‌ ఎలాంటి పోరాటం చేశాడు? అందుకు అతడు ఎంచుకున్న మార్గం ఏంటి? పరిస్థితి కోర్టు వరకూ ఎందుకు వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: గతంలో వచ్చిన ‘ఓ మై గాడ్’ కథ సినీ ప్రియులందరికీ తెలిసిందే. దేవుడు అంటే నమ్మకం లేని ఒక వ్యక్తి తనకు జరిగిన అన్యాయానికి దేవుడే కారణమంటూ కోర్టులో సాగించే పోరాటం. ఇప్పుడు ‘ఓ మైగాడ్ 2’ కోసం దర్శకుడు అమిత్‌ రాయ్‌ ఓ సున్నితమైన అంశాన్ని ఎంచుకున్నారు. అదే సెక్స్‌ ఎడ్యుకేషన్‌. ‘శృంగారం గురించి మాట్లాడితే అందరూ ఛీ అంటారు. కానీ, భారతదేశ జనాభా 140 కోట్లు’ ఇది ఓ షోలో పంచ్‌ డైలాగ్‌. నిజమే భారతీయ సమాజంలో శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడాన్ని తప్పుగా భావిస్తారు. కానీ, యువత పెడదారి పట్టిపోవడానికి కారణం కూడా సెక్స్‌ ఎడ్యుకేషన్‌పై సరైన అవగాహన లేకపోవడమేనన్నది నిపుణుల మాట. ముఖ్యంగా కౌమర దశలో ఉన్న పిల్లలకు ఏది మంచి? ఏది చెడు? అన్న విషయాలను చెప్పడానికి తల్లిదండ్రులు సైతం సంకోచిస్తారు. ఒకవేళ అలాంటి ప్రశ్న పిల్లల నుంచి ఎదురైనా ‘నోరు మూసుకో’ అంటూ వాళ్లను అక్కడితో ఆపేస్తారు. హైస్కూల్‌ స్థాయిలో ‘పునరుత్పత్తి’ అంశంపై పాఠాలు ఉన్నా వాటిని సక్రమంగా బోధించడానికి ఉపాధ్యాయులు సైతం వెనకాడుతుంటారు. అలాంటి ఓ సున్నితమైన అంశాన్ని సెటైరికల్‌గా చెప్పడంలో దర్శకుడు అమిత్‌రాయ్‌ విజయం సాధించారు.

ముగ్దల్‌ భక్తి, కుటుంబం పట్ల అతడు చూపే ప్రేమ తదితర సన్నివేశాలతో పాత్రలను పరిచయం చేసిన దర్శకుడు, ఆ తర్వాత అసలు పాయింట్‌కు వచ్చేశాడు. ముగ్దల్‌ కుమారుడు పాఠశాల నుంచి బహిష్కరణకు గురవడంతోనే కథ కీలక మలుపు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఊరి నుంచి వెళ్లిపోదామనుకున్న ముగ్దల్‌కు సాయంగా దేవదూత రావడం, ‘సమస్య నుంచి పారిపోవడం కాదు.. ఎదిరించాలి’ అన్న మాటలతో ముగ్దల్‌ న్యాయం పోరాటం చేయడానికి సిద్ధమయ్యే సన్నివేశాలు అలరిస్తాయి. ‘పార్ట్‌-1’లో లాగానే ఏ లాయరూ అతడికి సాయం చేయకపోవడంతో తన కేసును తానే వాదించుకోవడానికి ముగ్దల్‌ రంగంలోకి దిగుతాడు. మరోవైపు ప్రత్యర్థి లాయర్‌గా యామీ గౌతమ్‌ గట్టి పోటీ ఇస్తుంది.

సెక్స్‌ ఎడ్యుకేషన్‌పై కోర్టులో జరిగే వాదనలు ఒకవైపు ఆసక్తి కలిగిస్తూనే.. ఆ క్రమంలో చోటు చేసుకునే సంభాషణలు సునిశిత హాస్యాన్ని పంచుతాయి. ఈ కోర్టు రూమ్‌లో జరిగే వాదనల్లో అసభ్యతకు తావు లేకుండా రచనా బృందం జాగ్రత్తలు తీసుకుంది. పిల్లల్లో వచ్చే శారీరక మార్పుల గురించి చర్చించడానికి ఇష్టపడని భారతీయ తల్లిదండ్రుల దృష్టి కోణాన్ని ఈ చిత్రం మారుస్తుంది. సినిమా మొత్తంలో దర్శకుడు ఒక చిన్న పాయింట్‌ను వదిలేశాడు. బాలుడికి సంబంధించిన వీడియో లీక్‌ కావడం కూడా శిక్షింపదగిన నేరం. అయితే, సినిమా మొత్తంలో ఎక్కడా ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం ఆశ్చర్యం. బాత్రూమ్‌ల్లోకి కెమెరాను తీసుకెళ్లడం మొదట కేసు అవుతుంది. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అనే పాయింట్‌ను ప్రస్తావిస్తున్నప్పుడు ఇలాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని దర్శకుడు ఒకట్రెండు సన్నివేశాలను రాసుకుని ఉంటే బాగుండేది.

ఎవరెలా చేశారంటే:  సినిమాలో ఎక్కువ మార్కులు పంకజ్‌ త్రిపాఠికి పడతాయి. తన నటన, డైలాగ్‌ డెలివరీ, కోర్టులో వాదనలు జరిగే సమయంలో హావభావాలతో చక్కగా నటించారు. ఒక రకంగా సినిమాను తన భుజాలపై మోశారు. ముగ్దల్‌ పాత్రలో ఆయనను తప్ప మరొకరిని ఊహించుకోలేం. దేవదూతగా అక్షయ్‌కుమార్‌ తనదైన నటనతో మెప్పించారు.  ఆయన కనిపించిన ప్రతి సీన్‌లో ఓ ఎలివేషన్‌ వచ్చింది. లాయర్‌గా యామీ గౌతమ్‌ కూడా బాగానే నటించింది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. దర్శకుడు అమిత్ రాయ్‌ ఎంచుకున్న పాయింట్‌ చాలా సున్నితమైనది. దాన్ని అదే స్థాయిలో ప్రజెంట్‌ చేశారు. కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా. పిల్లలకు తల్లిదండ్రులకూ మధ్య ఒక వారధిగా నిలుస్తుంది. చాలా మంది తల్లిదండ్రులకు కనువిప్పు కలిగిస్తుంది.

  • బలాలు
  • + కథ, కథనాలు
  • + నటీనటులు
  • + దర్శకత్వం, సాంకేతిక బృందం పనితీరు
  • బలహీనతలు
  • - ఒకే అంశాన్ని పదే పదే చర్చించడం
  • - అక్కడక్కడా సుదీర్ఘంగా సాగే కోర్టు సన్నివేశాలు
  • చివరిగా: ‘ఓ మైగాడ్‌ 2’ ప్రతి కుటుంబానికి ఒక పాఠం
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని