ODI World Cup 2023: వచ్చేస్తోంది వన్డే సంబరం

పొట్టి క్రికెట్లో రెండేళ్లకో ప్రపంచకప్‌ చూస్తున్నాం. ఏడాది వ్యవధిలోనూ రెండు టీ20 ప్రపంచకప్‌లు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. టెస్టుల్లోనూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు జరుగుతున్నాయి

Updated : 16 Aug 2023 10:41 IST

ఇంకో 50 రోజుల్లోనే ప్రపంచకప్‌

పొట్టి క్రికెట్లో రెండేళ్లకో ప్రపంచకప్‌ చూస్తున్నాం. ఏడాది వ్యవధిలోనూ రెండు టీ20 ప్రపంచకప్‌లు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. టెస్టుల్లోనూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు జరుగుతున్నాయి. కానీ క్రికెట్‌ అభిమానులకు అసలైన ప్రపంచకప్‌ అంటే వన్డే ట్రోఫీనే. దానికున్న చరిత్ర వేరు. దాని విలువ వేరు. ప్రపంచంలో ప్రతి క్రికెటరూ అందుకోవాలనుకునే ట్రోఫీ అది. ప్రతి క్రికెట్‌ అభిమానిలోనూ ఉద్వేగాన్ని రేకెత్తించే టోర్నీ అది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సరిగ్గా ఇంకో 50 రోజులే ఉంది. సారి మెగా టోర్నీకి భారత్‌ ఆతిథ్యమిస్తుండటం మన అభిమానులకు మరింత ప్రత్యేకం. సొంతగడ్డపై రోహిత్‌ సేన భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. ప్రపంచకప్‌ సమీపిస్తుండగా అందులో పోటీ పడే జట్లన్నీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో ఉండగా.. ఐసీసీ, బీసీసీఐ టోర్నీ సన్నాహాల్లో మునిగిపోయి ఉన్నాయి. ఇక అభిమానులేమో ఇప్పటిదాకా జరిగిన ప్రపంచకప్‌ల తాలూకు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ... కొత్త టోర్నీ కోసం ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఈసారి ప్రపంచకప్‌ను ప్రత్యేకంగా మార్చే అనేక విశేషాలు ఆ టోర్నీతో ముడిపడి ఉన్నాయి.

  •  ఇప్పుడు జరగబోయేది 13వ వన్డే ప్రపంచకప్‌. ఈ టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వబోతుండటమిది నాలుగోసారి. 1987లో తొలిసారి పాకిస్థాన్‌తో కలిసి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. 1996లో ప్రపంచకప్‌ నిర్వహణలో భారత్‌కు పాకిస్థాన్‌, శ్రీలంక తోడయ్యాయి. 2011లో భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ కలిసి ఉమ్మడిగా టోర్నీకి ఆతిథ్యమిచ్చాయి. తొలిసారి భారత్‌ మాత్రమే ప్రపంచకప్‌ను నిర్వహించబోతోంది.
  •  వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా అత్యధికంగా అయిదుసార్లు (1987, 1999, 2003, 2007, 2015) గెలిచింది. భారత్‌ (1983, 2011), వెస్టిండీస్‌ (1975, 1979) రెండుసార్లు చొప్పున కప్పు నెగ్గాయి. పాకిస్థాన్‌ (1992), శ్రీలంక (1996), ఇంగ్లాండ్‌ (2019) ఒక్కోసారి టైటిల్‌ సాధించాయి. పెద్ద జట్లలో న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా మాత్రమే ఇంకా కప్పు గెలవలేదు.
  • 1983లో తొలిసారి కపిల్‌ నేతృత్వంలో వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న భారత్‌.. 28 ఏళ్ల తర్వాత 2011లో ధోని సారథ్యంలో ఆ ట్రోఫీని అందుకుంది. ఇప్పుడు రోహిత్‌ సారథ్యంలో కప్పు వేటకు సిద్ధమవుతోంది.
  •  2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఆటగాళ్లలో ఒక్క విరాట్‌ కోహ్లి మాత్రమే ప్రస్తుత జట్టులో సభ్యుడు.
  • అక్టోబరు 5న 2019 ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో మొదలయ్యే ప్రపంచకప్‌ నవంబరు 19న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. టోర్నీలో 45 లీగ్‌ మ్యాచ్‌లు సహా మొత్తం 48 మ్యాచ్‌లు జరుగుతాయి.
  •  ఈసారి టోర్నీలో పది జట్లు పోటీ పడుతుండగా.. లీగ్‌ దశలో ప్రతి జట్టూ మిగతా తొమ్మిది జట్లలో ఒక్కో లీగ్‌ మ్యాచ్‌ ఆడుతుంది. లీగ్‌ దశలో టాప్‌-4లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
  •  ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. హైదరాబాద్‌ మూడు లీగ్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తుంది. అయితే ఇక్కడి ఉప్పల్‌ స్టేడియానికి   భారత్‌ మ్యాచ్‌ను మాత్రం కేటాయించలేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు