BCCI - Stephen Fleming: కొత్త ప్రధాన కోచ్‌ పదవి రేసులో ఫ్లెమింగ్‌.. జయవర్థెనె? అతడికే ఎక్కువ ఛాన్స్‌!

భారత ప్రధాన కోచ్‌ పదవి రేసులో కొత్త పేర్లు చర్చకొస్తున్నాయి. అయితే, ఇప్పటికే బీసీసీఐ వర్గాలు చెన్నై కోచ్‌తో సంప్రదింపులు జరిపాయనే కథనాలూ వస్తున్నాయి.

Published : 21 May 2024 12:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత ప్రధాన కోచ్‌ పదవిని ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి పొడిగింపుపై ఇంట్రెస్ట్‌గా లేడు. ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తుల ఆహ్వానం కోరిన సంగతి తెలిసిందే. కొత్త కోచ్‌ భారత జట్టుకు 2027 వన్డే ప్రపంచ కప్‌ వరకు సేవలందిస్తాడు. కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకొనేందుకు మే 27 డెడ్‌లైన్. ఈ క్రమంలో చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, దిల్లీ కోచ్ రికీ పాంటింగ్‌తోపాటు కోల్‌కతా మెంటార్ గౌతమ్ గంభీర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

ఈసారి విదేశీ కోచ్‌ను తీసుకొనేందుకు బీసీసీఐ మొగ్గు చూపిస్తుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌లోని పరిస్థితులు, ఆటగాళ్లను అర్థం చేసుకోవడంలో అందరికంటే ఫ్లెమింగ్‌ ముందున్నాడనేది కొందరి వాదన. అంతేకాదు.. ఇందుకోసం బీసీసీఐ ధోనీ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్లెమింగ్‌ను ఒప్పించాలని మహీని బోర్డు సంప్రదించినట్లు సమాచారం. కొత్తగా కోచింగ్‌ బాధ్యతలు చేపట్టే వ్యక్తి సంవత్సరంలో కనీసం పది నెలలపాటు భారత జట్టుతో ఉండాల్సి ఉంటుంది. అయితే, స్టీఫెన్ ఫ్లెమింగ్‌ అసలు పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడా? లేదా? అనేది ఇంకా తెలియలేదు. చెన్నై సూపర్ కింగ్స్‌  ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్లెమింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ పోస్టు పెట్ట్టింది. మరోవైపు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ మాత్రం ఫ్లెమింగ్‌తో దీని గురించి చర్చే జరగలేదని స్పష్టం చేశారు. ‘‘ప్రధాన కోచ్‌ పదవి గురించి నేనేమీ ఇలాంటి వ్యాఖ్యలు వినలేదు. స్టీఫెన్‌ నుంచి కూడా మాకు దానిపై సమాచారం లేదు’’ అని పేర్కొన్నారు.

ఆ ఇద్దరు కూడా..?

ప్రధాన కోచ్‌ రేసులో పైన ముగ్గురే కాకుండా.. శ్రీలంక మాజీ కెప్టెన్, ముంబయి కోచ్‌గా వ్యవహరించిన మహేల జయవర్థెనె పేరు కూడా కొత్తగా చర్చకొచ్చింది. అయితే, ఇప్పటివరకు తాను దరఖాస్తు కూడా చేయలేదని.. ఎవరూ సంప్రదించలేదని జయవర్థెనె వెల్లడించాడు. ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్‌ లాంగర్ మంచి ఎంపిక అవుతుందని కొందరి అభిప్రాయం. కంగారూల జట్టును  టీ20, వన్డే ప్రపంచ కప్‌ విజేతగా నిలిపిన అనుభవం అతడి సొంతం. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత్‌ జట్టు కోచింగ్‌ బాధ్యతలు అత్యంత కఠినమైనవిగా లాంగర్ పేర్కొన్నాడు. ‘‘భారీ అంచనాలు, అత్యంత విలువైన జట్టుకు కోచ్‌గా ఉండటం చాలా ఒత్తిడితో కూడుకున్నదే. అద్భుత అవకాశమే కాకుండా జట్టును ఐసీసీ టైటిల్స్‌ విజేతగా నిలిపితే గొప్ప గౌరవం దక్కుతుంది’’ అని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు