Anand Mahindra: కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Anand Mahindra: ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన బెంగళూరు జట్టు, కోహ్లీపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. కింగ్‌ కంటే స్ఫూర్తినిచ్చేవారు ఎవరుంటారని ప్రశంసించారు.

Published : 20 May 2024 16:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఎన్నో ఆసక్తికర విషయాలు, ప్రేరణ కలిగించే వీడియోలను పంచుకుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). తాజాగా ఆయన స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అనూహ్యంగా దూసుకొచ్చిన బెంగళూరు జట్టు, కోహ్లీ (Virat Kohli) కంటే స్ఫూర్తినిచ్చేవారు ఎవరుంటారని ప్రశంసించారు.

‘‘పొరపాట్లు చేసినప్పుడు, కింద పడిపోయినప్పుడు వాటిని సరిదిద్దుకుని తిరిగి పైకి లేచే వ్యక్తులపై మా కంపెనీ విశ్వాసంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ప్రయత్నాన్ని వదిలిపెట్టొద్దు. అలాంటివారిని మేం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాం. అభినందిస్తాం. ఈ మండే మోటివేషన్‌లో కింగ్ కోహ్లీ, బెంగళూరు కంటే మించి మనకు స్ఫూర్తి కలిగించేవారు ఇంకెవరున్నారు?’’ అని మహీంద్రా రాసుకొచ్చారు. ఆయన పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.  ‘సరిగ్గా చెప్పారు సర్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఒక్కోసారి ‘వన్‌ పర్సెంట్’ ఛాన్స్‌ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ

ఈ ఐపీఎల్ టోర్నీలో బెంగళూరు ఆఖరి నిమిషంలో ప్లేఆఫ్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒకేఒక్క గెలుపుతో తొలుత పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఆ జట్టు.. ఆ తర్వాత వరుసగా  6 మ్యాచ్‌ల్లో గెలిచి అనూహ్యంగా టాప్‌-4లో చోటు దక్కించుకుంది. మంచి ఫామ్‌తో ఆకట్టుకుంటున్న విరాట్‌.. బెంగళూరు ప్రయాణంలో కీలక పాత్ర పోషించాడు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఈ జట్టు రాజస్థాన్‌తో తలపడనుంది. అక్కడ గెలిస్తే క్వాలిఫయర్‌- 2కు అర్హత సాధిస్తుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ అందుకోని బెంగళూరు ఈసారి ఆ కల నేరవేర్చుకోవాలని అభిమానులు ఆశ పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని