Virat Kohli: ఒక్కోసారి ‘వన్‌ పర్సెంట్’ ఛాన్స్‌ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 17వ సీజన్‌లో బెంగళూరు జట్టు అద్భుతం చేసింది. ఊహించని విధంగా నాకౌట్‌కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Published : 20 May 2024 09:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అనూహ్యంగా ఐపీఎల్ 17వ సీజన్‌ ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టు బెంగళూరు. చివరి మ్యాచ్‌లో విజయ సాధించడంతోపాటు నెట్‌రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉండేది. చాలా తక్కువగా అవకాశం ఉన్నప్పటికీ ఆర్సీబీ సాధించి నాకౌట్‌కు చేరుకుంది. ఈ క్రమంలో బెంగళూరు స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ ‘వన్‌ పర్సెంట్‌ ఛాన్స్‌’ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, మ్యాచ్‌కు సంబంధించి కాకుండా యువతకు విలువైన సూచనలు ఇస్తున్న వీడియో అది. ఇప్పుడు ఆ మాటలే నిజం చేయడంతో ఆర్సీబీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇంతకీ కోహ్లీ ఏం మాట్లాడటంటే? 

‘‘మనం కేవలం ఒక్క శాతం ఛాన్స్‌ మాత్రమే ఉందనుకుందాం.. ఏదైనా సాధించడానికి ఒక్కోసారి ఆ వన్‌ పర్సెంట్ సరిపోతుంది. కానీ, దానిని ఎలా అందిపుచ్చుకోవాలనేదే అత్యంత కీలకం. చివరి వరకూ శ్రమిస్తే.. ఒక్క శాతం 10కి పెరుగుతుంది. ఇంకాస్త కష్టపడితే అది 30 శాతానికి చేరుతుంది. ఇలా.. నిరంతరం సాధన చేయడం వల్ల విజయం సాధించేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి. చివరికి ఏదొక మాయజాలం నమోదయ్యేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. 

ఆరెంజ్‌ క్యాప్‌ అతడికే..

లీగ్‌ స్టేజ్‌లో విరాట్ కోహ్లీ 14 మ్యాచుల్లో 708 పరుగులు చేశాడు. అతడి తర్వాత చెన్నై కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ (583) ఉన్నాడు. అయితే, సీఎస్కే నాకౌట్‌ దశకు చేరుకోలేని సంగతి తెలిసిందే. ట్రావిస్ హెడ్ 12 మ్యాచుల్లో 533 పరుగులు, రియాన్ పరాగ్ 531 పరుగులతో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆరెంజ్‌ క్యాప్‌ విరాట్ వద్దే ఉంది. పై వారినుంచి మాత్రమే కోహ్లీ స్కోరుకి ఏదైనా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అలా జరగాలంటే మిగతా మ్యాచుల్లో వారి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు రావాల్సిందే. బెంగళూరు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌తో తలపడనుంది. మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ ఇందులోనూ రాణించి.. ఆర్సీబీ గెలిస్తే మళ్లీ క్వాలిఫయర్‌ 2లో తలపడాల్సి ఉంటుంది. అక్కడా విజయం సాధిస్తే ఫైనల్‌లోకి అడుగు పెట్టేందుకు ఆస్కారముంది. కాబట్టి, మరో మూడు మ్యాచ్‌లు వరకు విరాట్ ఆడేందుకు ఛాన్స్‌ ఉంది. మరో 100 పరుగులు చేస్తే.. ఐపీఎల్‌ చరిత్రలో రెండుసార్లు 800+ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా అవతరిస్తాడు. 2016 సీజన్‌లో ‘కింగ్‌’ 974 రన్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని