Archery Medals: విలువిద్యలో వెల్లువలా... పతకాల పంట పండిస్తున్న ఆర్చర్లు

జ్యోతి సురేఖ (Jyothi Vennam), అదితి స్వామి (Aditi Swami), పర్ణీత్‌ కౌర్ (Parneet Kaur), పార్థ్‌ సాలుంకె (Parth Salunkhe), ఒజాస్‌ ప్రవీణ్‌ (Ojas Pravin)... భారత ఆర్చరీలో ఆ మాటకొస్తే ప్రపంచ ఆర్చరీలో వీరి గురించే ఇప్పుడు చర్చ. అంతగా వీరు ఏం సాధించారు, దేశానికి ఏం ఘనత తెచ్చిపెట్టారో మీరే చదవండి. 

Published : 18 Aug 2023 14:38 IST

త్యంత పోటీ ఉండే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ అయినా.. ఉత్తమ ఆర్చర్లు బరిలో దిగే ప్రపంచకప్‌ పోటీలైనా.. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌ అయినా.. మరో అంతర్జాతీయ టోర్నీ అయినా.. మన ఆర్చర్ల ‘గురి’ తప్పడం లేదు. విలువిద్యలో వెల్లువలా పతకాలు వచ్చి చేరుతున్నాయి. పోటీ ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. మన ఆర్చర్లు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. చారిత్రక విజయాలతో.. సంచలన ప్రదర్శనతో సత్తాచాటుతున్నారు. విల్లు ఎక్కుపెట్టి.. పతకాల గురి చూసి బాణాలు విసురుతున్నారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో భారత ఆర్చర్లదే ఆధిపత్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మన ఆర్చర్లు.. ఇప్పుడు ప్రపంచకప్‌ నాలుగో అంచె పోటీల్లోనూ పతకాల వేటలో సాగుతున్నారు. రికర్వ్‌ పురుషుల, మహిళల జట్లు కాంస్యాలు నెగ్గగా.. కాంపౌండ్‌ పురుషుల, మహిళల జట్లు ఫైనల్లో అడుగుపెట్టాయి. తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో సెమీస్‌ చేరి పతకం దిశగా దూసుకెళ్తోంది.

మన దిగ్గజం..

ఇటీవల బెర్లిన్‌లో ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌ జరిగింది. అందులో భారత మహిళల కాంపౌండ్‌ జట్టు.. టీమ్‌ విభాగంలో పసిడితో చరిత్ర సృష్టించింది. అప్పటివరకూ చేరని ఘనత అప్పుడే సొంతమైంది. ఈ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌ చరిత్రలో భారత్‌కు దక్కిన మొట్టమొదటి పసిడి అది. ఇందులో కీలక పాత్ర పోషించింది మన విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ (Jyothi Surekha Vennam). యువ సంచలనాలు అదితి స్వామి (Aditi Gopichand Swami), పర్ణీత్‌ కౌర్‌ (Parneet Kaur)తో కలిసి జట్టును టైటిల్‌ దిశగా నడిపించింది 27 ఏళ్ల సీనియర్‌ జ్యోతి. 

బిజినెస్‌ క్లాస్‌లో తొలిసారి ప్రయాణం.. రింకు సింగ్‌ రియాక్షన్‌ ఏంటంటే?

అప్పటికే అయిదు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ ఆడి.. ఆరు (నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు) పతకాలు సాధించిన ఆ కాంపౌండ్‌ ఆర్చరీ దిగ్గజం.. ఇప్పుడు తొలిసారి స్వర్ణాన్ని ముద్దాడింది. వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణం సాధించేలా కనిపించిన జ్యోతి.. సెమీస్‌లో అదితి చేతిలో ఓడింది. ఆ తర్వాత కాంస్య పతక పోరులో నెగ్గి.. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో తన పతకాల సంఖ్యను ఎనిమిదికి పెంచుకుంది. ఇప్పటివరకూ మరే భారత ఆర్చర్‌ కూడా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఇన్ని పతకాలు నెగ్గలేదు. భవిష్యత్‌లో గెలుస్తారా? అంటే అవునని కచ్చితంగా సమాధానం చెప్పలేం! 

టీనేజర్ల జోరు.. 

మొన్నటి వరకూ కాంపౌండ్‌ మహిళల ఆర్చరీ అంటే జ్యోతి సురేఖ పేరు వినిపించేది. కానీ, ఇప్పుడు తామున్నామంటూ యువ ఆర్చర్లు దూసుకొస్తున్నారు. పిన్న వయస్సులోనే ప్రపంచ ఆర్చరీని శాసిస్తున్నారు. భవిష్యత్‌ మనదే అనే ధీమా కలిగిస్తున్నారు. 17 ఏళ్లకే మహారాష్ట్ర ఆర్చర్‌ అదితి గోపీచంద్‌ స్వామి.. సీనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి సంచలనం నమోదు చేసింది. అతి పిన్న వయస్సు ప్రపంచ ఛాంపియన్‌ ఆమెనే. ఆ ఘనత సాధించిన మొట్టమొదటి భారత ఆర్చర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. వ్యక్తిగత స్వర్ణంతో పాటు టీమ్‌ పసిడిని కూడా ఖాతాలో వేసుకున్న ఆమె.. ఈ ఏడాది అండర్‌-18లోనూ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంతో పాటు టీమ్‌లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 

చిన్న వయసులోనే అద్భుతమైన గురితో గొప్ప పరిణతి ప్రదర్శిస్తూ ఆమె సాగుతోంది. పంజాబ్‌కు చెందిన 18 ఏళ్ల పర్ణీత్‌ కౌర్‌ ఇప్పటికే అండర్‌-18, అండర్‌-21, సీనియర్‌ టీమ్‌ స్వర్ణాలు సొంతం చేసుకుంది. అదితి గ్రామం నుంచే వచ్చిన 19 ఏళ్ల పార్థ్‌ సాలుంకె (Parth Salunkhe) ఒలింపిక్స్‌ క్రీడాంశమైన రికర్వ్‌ ఆర్చరీలో అండర్‌-21 ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారత ఆర్చర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అతని ఖాతాలో మిక్స్‌డ్‌ టీమ్, టీమ్‌ స్వర్ణాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రకే చెందిన మరో ఆర్చర్‌ 21 ఏళ్ల ఒజాస్‌ ప్రవీణ్‌ (Ojas Pravin Deotale) కాంపౌండ్‌ ప్రపంచ టైటిల్‌ సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా అవతరించాడు. వీళ్ల ప్రదర్శన చూస్తుంటే భవిష్యత్‌లో భారత ఆర్చరీకి తిరుగులేదనిపిస్తోంది.

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని