UMRAN MALIK : ఉమ్రాన్‌, అర్ష్‌దీప్‌ ఆడతారా?

గత ఏడాది విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ పనిలో ఉండగా.. మరోవైపు శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని మరో జట్టు శ్రీలంకతో వన్డే, టీ20లు ఆడింది. ఇప్పుడు అలాంటి దృశ్యమే చూడబోతున్నాం! రోహిత్‌ నేతృత్వంలోని టెస్టు జట్టులో గత ఏడాది సిరీస్‌లో మిగిలిపోయిన చివరి మ్యాచ్‌ను

Updated : 25 Jun 2022 06:59 IST

ఐర్లాండ్‌తో టీ20లకు తుది జట్టుపై ఉత్కంఠ

మలహైడ్‌: గత ఏడాది విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ పనిలో ఉండగా.. మరోవైపు శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని మరో జట్టు శ్రీలంకతో వన్డే, టీ20లు ఆడింది. ఇప్పుడు అలాంటి దృశ్యమే చూడబోతున్నాం! రోహిత్‌ నేతృత్వంలోని టెస్టు జట్టులో గత ఏడాది సిరీస్‌లో మిగిలిపోయిన చివరి మ్యాచ్‌ను ఆడేందుకు సన్నాహాల్లో ఉంటే.. హార్దిక్‌ నాయకత్వంలో టీ20 జట్టు ఐర్లాండ్‌ను ఢీకొనబోతోంది. రెండు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆదివారమే జరగబోతోంది. ఈ సిరీస్‌కు భారత తుది జట్టు ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ఇంకో నాలుగు నెలల్లో టీ20 ప్రపంచకప్‌ రాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో బరిలోకి దించే జట్టుపై ఒక అంచనాకు రావడానికి ఇదే సరైన సమయం. ఐర్లాండ్‌తో, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ అయ్యేలోపు ప్రపంచకప్‌ ఆడబోయే ఆటగాళ్లెవరో దాదాపుగా తేలిపోతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌పై యువ జట్టును బరిలోకి దించనున్న భారత్‌.. కుర్రాళ్ల సత్తాను పరీక్షించడానికి దీన్ని వేదికగా చేసుకోవాలనుకుంటోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో అవకాశం దక్కించుకోని యువ పేసర్లు ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఈ సిరీస్‌లో మైదానంలోకి దిగే అవకాశాలున్నాయి. దక్షిణాఫ్రికాపై తుది జట్టులో ఆడిన భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, అవేష్‌ ఖాన్‌ ఈ సిరీస్‌లోనూ కొనసాగుతున్నారు. అయితే అవేష్‌తో పాటు మిగతా ఇద్దరిలో ఒక్కొక్కరిని ఒక్కో మ్యాచ్‌కు పక్కన పెట్టి అయినా ఉమ్రాన్‌, అర్ష్‌దీప్‌లకు అవకాశమివ్వొచ్ఛు ప్రత్యర్థి చిన్న జట్టే కాబట్టి కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఇంతకంటే మంచి ఛాన్స్‌ ఉండదు.

ఆ రెండు స్థానాల్లో ఎవరు?: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్లో 3, 4 స్థానాలను భర్తీ చేసిన శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌.. ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌ కోసం వెళ్లిపోయారు. వారు ఖాళీ చేసిన స్థానాల్లో ఐర్లాండ్‌పై ఎవరు ఆడతారన్నది ఆసక్తికరం. గాయం కారణంగా సఫారీలతో సిరీస్‌కు అందుబాటులో లేని సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు చాన్నాళ్లకు తిరిగి జట్టులోకి వచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌, కొత్తగా అవకాశం దక్కించుకున్న రాహుల్‌ త్రిపాఠి, ఆల్‌రౌండర్లు వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా రేసులో ఉన్నారు. సూర్యకుమార్‌ ఇంతకుముందు వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్న నేపథ్యంలో అతనే మూడో స్థానంలో ఆడే అవకాశం ఉంది. వెంకటేశ్‌ ఫామ్‌లో లేని నేపథ్యంలో సంజు, త్రిపాఠి, హుడాల్లో ఒకరిని ఆడించొచ్చు. త్రిపాఠిని నేరుగా తుది జట్టులోకి తీసుకుంటారా లేక ఈ సిరీస్‌ వరకు బెంచ్‌పై కూర్చోబెడతారా అన్నది చూడాలి. దక్షిణాఫ్రికాపై విఫలమైనప్పటికీ ఓపెనర్‌గా రుతురాజ్‌కు మరో అవకాశం దక్కొచ్చు. అతడితో కలిసి ఇషానే ఇన్నింగ్స్‌ను ఆరంభించొచ్చు. 5, 6 స్థానాల్లో కెప్టెన్‌ హార్దిక్‌, ఫినిషర్‌ కార్తీక్‌ ఆడతారు. చాహల్‌కు తోడు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌నే ఆడిస్తారా.. లేక ఐర్లాండ్‌ పిచ్‌లకు తగ్గట్లు వెంకటేశ్‌ను ఏమైనా ఎంచుకుంటారా అన్నది చూడాలి. ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ టెస్టు జట్టుతో పాటు ఉండడంతో జాతీయ క్రికెట్‌ అకాడమీ ఛైర్మన్‌ లక్ష్మణ్‌ ఈ సిరీస్‌కు శిక్షకుడిగా వ్యవహరించనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని